Srikakulam | సంప్రదాయాలను కొనసాగించాలి

Srikakulam | సంప్రదాయాలను కొనసాగించాలి
- కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
Srikakulam | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : మన తరువాతి తరాలకు ఆచార సంప్రదాయాలను చేరవేసే బాధ్యతను ప్రతీ ఒక్కరు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలసి శ్రీకాకుళం లోని తన స్వగృహంలో భోగిమంటలు వేశారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన చెంచులతో ముచ్చటించారు.
కూటమి సర్కారు ప్రజారంజక పాలనలో ప్రతీ పల్లెలో సంక్రాంతి శోభ మెండుగా కనిపిస్తోందని, ప్రతీ ఇంట సిరుల సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. పుట్టిన ఊరికి పంచే మమకారమే నిజమైన సంక్రాంతి అని రామ్మోహన్ నాయుడు అన్నారు.. భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, రంగవల్లులు, డూడూ బసవన్నలు, పతంగుల సందడులతో అందరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఇబ్బందులు లేని వ్యవసాయాన్ని అన్నదాతలు చేస్తున్నారని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి జాప్యం, ఇతరుల ప్రమేయం లేకుండా సక్రమంగా చెల్లింపులు సత్వరం జరుగుతున్నాయని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పాటు మొదలు విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు అన్నింటా మెరుగైన వృద్ధి సాధిస్తున్నామని, విశేషంగా పెట్టుబడులను తీసుకువచ్చామని అన్నారు.
ప్రధాని మోదీ తోడ్పాటుతో ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా మార్చే కీలక ప్రాజెక్టులు మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని.. వ్యవసాయం, ఉపాధి విషయంలో విప్లవాన్ని చూస్తామని స్పష్టం చేశారు. భోగాపురం జూన్ కన్నా ముందే ప్రారంభిస్తామని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు.. దానికి అనుసంధానంగా శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని అన్నారు. వచ్చే సంక్రాంతి నాటికి సరికొత్త ఉత్తరాంధ్ర సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
