మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉచిత నైపుణ్య శిక్షణ
మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉచిత నైపుణ్య శిక్షణ
పెనుబర్తిలో మగ్గం పనుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూన రవికుమార్
పొందూరు(ఆముదాలవలస), ఆంధ్రప్రభ:
మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆముదాలవలస శాసనసభ్యుడు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ పిలుపునిచ్చారు.
పొందూరు మండలం పెనుబర్తి గ్రామంలో యూనియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (RSETI) ఆధ్వర్యంలో మహిళలకు మగ్గం పనులు, చీరలు, డ్రెస్సుల డిజైనింగ్‌పై నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకుల ఆధ్వర్యంలో అందిస్తున్న పథకాలు, అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా మహిళలు స్వయం సమృద్ధి సాధించి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చీగిరిపల్లి రామ్మోహన్, సెక్రటరీ సిపాన రంగనాయకులు, బాడనగిరి, దండా రవి, శిక్షణ సంస్థ ప్రతినిధులు, బ్యాంకు అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
