YCP | ప్రైవేటీకరణ వద్దు..

YCP | ప్రైవేటీకరణ వద్దు..
- వైసీపీ నాయకుల నిరసన
- భోగి మంటల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో ప్రతులు
YCP | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : వైసీపీ అధిష్ఠానం పిలుపు మేరకు కదిరి పార్టీ సమన్వయకర్త బీఎస్ మక్బుల్ ఆదేశాల మేరకు భోగి పండుగ సందర్భంగా బుధవారం కదిరిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం ఎదుట పట్టణ అధ్యక్షులు షేక్ బాబ్జాన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి తీసుకొచ్చిన జీవోలను వైస్సార్సీపీ నాయకులు దహనం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించడం పేద, మధ్యతరగతి విద్యార్థులకు తీవ్ర అన్యాయమని వారు ఆరోపించారు. విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను వైస్సార్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య అవసరాల కోసం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. వైద్య విద్య ప్రైవేటీకరణ వల్ల ఫీజులు పెరిగి, సామాన్యుల పిల్లలకు వైద్య విద్య దూరమవుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఆ భగవంతుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించి, ప్రజా ప్రయోజనాలపై నిర్ణయాలు తీసుకునేలా చేయాలని వారు ప్రార్థించారు.
అనంతరం కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వర రెడ్డి, రాష్ట్ర మున్సిపల్ వింగ్ సెక్రటరీ లింగాల కృపాకర్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ వింగ్ సెక్రటరీ పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిల్లర్లు మొరపూరి రామ్ ప్రసాద్, షాను భాయ్, టౌన్ ఎస్సీ వింగ్ అధ్యక్షులు చిన్న రెడ్డెప్ప, టౌన్ బూత్ కమిటీ ఎహెసాన్, కంతంపల్లి ఉపసర్పంచ్ పక్రొద్దీన్, ఎస్సీ నాయకులు భాస్కర్, దివ్యాంగుల విభాగం టౌన్ అధ్యక్షులు నాగేంద్ర, నాయకులు అంజి తదితరులు పాల్గొన్నారు. వైస్సార్సీపీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
