99 Seats | కేరళ ముఖ్యమంత్రి పీఠానికి త్రిముఖ పోటీ

99 Seats | కేరళ ముఖ్యమంత్రి పీఠానికి త్రిముఖ పోటీ
పదవిని ఆశిస్తున్న కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల
తాను పోటీలో ఉన్నానన్న సతీశన్
కాంగ్రెస్ అగ్రనేతకు ఎంపిక బాధ్యత
99 Seats | తిరువనంతపురం, ఆంధ్రప్రభ : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది. 140 స్థానాలున్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఈ కూటమి 99 స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్నికల సంఘం ప్రకారం.. కేరళలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇప్పటికే మెజారిటీ మార్కును దాటేసింది. ఈ క్రమంలో కేరళ సీఎం ఎవరన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాజాగా అయితే.. సీఎం ఎవరవుతారన్న దానిపై పలు ఊహగానాలు మొదలయ్యాయి. ప్రస్తుత అసెంబ్లీలో విపక్ష నేత సతీశన్ సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. అయితే సీఎం పదవి కోసం కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల, సురేశ్ కూడా పోటీ పడుతున్నారు.
99 Seats | సతీశన్‌కు ముస్లిం లీగ్ మద్దతు..
ఇదిలా ఉంటే కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ , ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్‌కు తమ మద్దతు ప్రకటించింది. దశాబ్దం తర్వాత కేరళలో యూడీఎఫ్ తిరిగి అధికారంలోకి రావడం లాంఛనమైన వేళ.. సీఎం ఎవరనే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజలు కూడా సీఎం అభ్యర్థిగా సతీషన్ వైపే మొగ్గు చూపుతున్నారని పలు సర్వేలు వెల్లడించాయి.
99 Seats | రంగంలోకి కేసీ వేణుగోపాల్..
సీఎం ఎవరనే దానిపై.. కాంగ్రెస్ హైకమాండ్.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటుంది. అయినప్పటికీ.. 140 స్థానాల అసెంబ్లీలో కూటమి స్వల్ప మెజారిటీతో గెలిస్తే, రెండో అతిపెద్ద పార్టీ అయిన ఐయూఎంఎల్ పాత్ర నిర్ణయాత్మకంగా మారుతుంది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. యూడీఎఫ్ 99కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే కేరళ కాంగ్రెస్‌లో నిర్ణయాలన్నీ ఐయూఎంఎల్ వెనుక నుండి నడిపిస్తోందనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. ఈ ప్రచారం వల్ల కాంగ్రెస్ రాష్ట్రంలోని ఇతర వర్గాలకు దూరమవుతోందనే ఆందోళన కూడా ఉంది. గతంలో కేవలం రాష్ట్ర స్థాయి నేతలకే పరిమితమైన ఈ పోటీ, ఇప్పుడు హైకమాండ్‌లో కీలక నేత అయిన కేసీ వేణుగోపాల్ రంగంలోకి రావడంతో మరింత సంక్లిష్టంగా మారింది.
99 Seats | తుది నిర్ణయం రాహుల్ గాంధీపై..
గతంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తితే సీనియర్ నేతలకు కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చి సర్దుబాటు చేసేవారు. ఉదాహరణకు, 1995లో కె. కరుణాకరన్ స్థానంలో ఏకే ఆంటోనీ ముఖ్యమంత్రి అయినప్పుడు, కరుణాకరన్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించారు. 2004లో ఆంటోనీ రాజీనామా చేసి ఉమెన్ చాందీకి బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా ఆంటోనీకి యూపీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర ఇచ్చారు. అయితే ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో, కేరళ సీఎం పదవి కోసం జరుగుతున్న ఈ పోటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి చివరకు కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. తాజాగా ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అధిష్ఠానం అప్పగించినట్లు సమాచారం..
