‘నిన్ను కౌన్సిలర్ గా గెలిపించుకుంటాం స్వాతమ్మ’..

‘నిన్ను కౌన్సిలర్ గా గెలిపించుకుంటాం స్వాతమ్మ’..

7వ వార్డులో దావ స్వాతి ప్రచార ప్రభంజనం!
భారీ మెజార్టీతో గెలిపించుకుంటామంటూ ఓటర్ల వెల్లడి

బెల్లంపల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ): బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయం దగ్గర పడుతుండటంతో 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దావ స్వాతి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార పర్వానికి వార్డు ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభిస్తోంది. ఆదివారం వార్డులోని పలు బస్తీలు, కాలనీల్లో ఆమె తన మద్దతుదారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించగా.. ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. బస్తీలోని వృద్ధులు, మహిళలు దావ స్వాతిని చూడగానే ఎంతో ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని, “అవ్వ నిన్ను గెలిపించుకుంటాం స్వాతమ్మ” అంటూ భరోసా ఇచ్చారు. “మా వార్డు ఆడబిడ్డవు, మా సమస్యలు తెలిసిన దానివి.. నిన్ను కౌన్సిలర్‌గా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం” అంటూ ఓటర్లు ఆమెకు అండగా నిలవడం విశేషం. ఏ గల్లీలోకి వెళ్లినా మహిళలు మంగళ హారతులు పట్టి, తిలకం దిద్ది ఘనస్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా దావ స్వాతి మాట్లాడుతూ.. ఓటర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయబోనని స్పష్టం చేశారు.

7వ వార్డును పట్టణంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యమని పేర్కొంటూ, వార్డులో ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని, నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా అందేలా చర్యలు తీసుకుంటామని, రాత్రి వేళల్లో ఇబ్బంది కలగకుండా వార్డులోని అన్ని వీధుల్లో ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సహకారంతో వార్డుకు భారీగా నిధులు రాబట్టి అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు ప్రతి అర్హులైన పేదవాడికి అందేలా చూస్తానని వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువకులు, వందలాది మంది వార్డు మహిళలు పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించారు.

Leave a Reply