70percent | వాట్సాప్‌తో.. సైబర్ మోసం
70percent | వాట్సాప్‌తో.. సైబర్ మోసం
70percent | మాజీ ప్రధాని కుమారుడికి టోకరా
అకౌంట్ నుంచి కోట్ల రూపాయలు స్వాహా
ఢిల్లీలో భారీ మోసం వెలుగులోకి
70percent | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ఒక భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. భారత మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడైన నరేష్ గుజ్రాల్ సైబర్ నేరగాళ్ల బారినపడ్డారు. టెక్స్టైల్స్, లెదర్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను నడుపుతున్న నరేష్ గుజ్రాల్ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను దొంగిలించిన కేటుగాళ్లు.. ఆయన పేరుతో ఒక నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించారు. జూన్ 12 నుంచి 16వ తేదీల మధ్య కాలంలో సదరు నకిలీ ఖాతా ద్వారా గుజ్రాల్ కంపెనీకి చెందిన నమ్మకస్థుడైన ఉద్యోగిని సంప్రదించి, అత్యవసరంగా కొన్ని బ్యాంకు ఖాతాలకు కోట్ల రూపాయల నగదును బదిలీ చేయించారు.
నాలుగు వేర్వేరు లావాదేవీలతో..
అవతలి వ్యక్తి తన యజమానేనని నమ్మిన ఆ ఉద్యోగి ఎలాంటి అనుమానం లేకుండా నాలుగు వేర్వేరు లావాదేవీల ద్వారా కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాల్లోకి బదిలీ చేశారు. జూన్ 16న ఈ నగదు బదిలీల సమాచారాన్ని సదరు ఉద్యోగి నరేష్ గుజ్రాల్ కుమార్తె దీక్షా గుజ్రాల్‌కు తెలియజేయడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఆమె వెంటనే తన తండ్రిని సంప్రదించగా.. తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయన స్పష్టంచేశారు. దాంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా తక్షణమే ఫిర్యాదు చేసి ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.
70శాతం అమౌంట్ ఫ్రీజ్ చేసిన పోలీసులు
ఈ మోసంపై 78 ఏళ్ల నరేష్ గుజ్రాల్ స్పందిస్తూ.. ఢిల్లీ సైబర్ క్రైమ్ సంస్థలు, బ్యాంకులు అత్యంత వేగంగా స్పందించి మోసపోయిన మొత్తంలో దాదాపు 70 శాతం డబ్బును వివిధ ఖాతాల్లో స్తంభింపజేయగలిగారని చెప్పారు. ఇలాంటి మోసాలు జరిగినప్పుడు నష్టాన్ని తగ్గించుకోవడానికి ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. చార్టర్డ్ అకౌంటెంట్ కూడా అయిన నరేష్ గుజ్రాల్ కంపెనీలోనే ఈ తరహా మోసం జరగడం కార్పొరేట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నకిలీ వాట్సాప్ దోపిడీకి పాల్పడిన సూత్రధారులను పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.
