50-year | ‘ఇందిరాగాంధీ బతికుంటే బీజేపీని నిషేధించేవారు’
50-year | ‘ఇందిరాగాంధీ బతికుంటే బీజేపీని నిషేధించేవారు’
రాజకీయ దుమారం
50-year | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో కొత్త వివాదానికి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ చేసిన వ్యాఖ్యలు తెరలేపాయి. భారతీయ జనతా పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
జైపూర్‌లో నిర్వహించిన ఓ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన అశోక్ గహ్లోత్, దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. దేశంలో మతపరమైన ధ్రువీకరణ పెరుగుతోందని ఆరోపించిన ఆయన, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారంలో ఉన్నవారు ఉద్దేశపూర్వకంగా విభజన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికీ అవకాశం ఇవ్వలేదని గహ్లోత్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరును ప్రస్తావిస్తూ, ఆమె నేడు బతికుంటే బీజేపీ వంటి పార్టీపై నిషేధం విధించేవారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి హిందువులు, హిందుత్వపై ద్వేషం ఉందని ఆరోపిస్తూ గహ్లోత్ వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు. గహ్లోత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్-బీజేపీ మధ్య మరోసారి రాజకీయ వాగ్వాదం ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.
