30 Nov 2025 Sunday Magazine | ఆదివారం సంచిక 30 నవంబర్ 2025
ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్రభ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు..
–అసోసియేట్ ఎడిటర్, prabhanews.com
30 Nov 2025 Sunday Magazine సంచికలో…
1.కాలుష్యం…. నియంత్రణ…
2.చెప్పుకోండి చూద్దాం.. ప్రశ్నలు
3.ఆకలి చిరునామా
4.మనసు-మాట శీర్షిక
5.కబుర్లు – శీర్షిక
6.సన్నిహితం… శీర్షిక
7.మెదడుకు మేత-సామెత.. శీర్షిక
8.వినరో భాగ్యము – శీర్షిక
9.చెప్పుకోండి చూద్దాం.. సమాధానాలు
30 Nov 2025 Sunday Magazine

30 Nov 2025 Sunday Magazine | 1.కాలుష్యం…. నియంత్రణ…
30 Nov 2025 Sunday Magazine | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఒక దుర్ఘటన…ఒక విపత్తు…ఎక్కడ జరిగినా ఆ వార్త చూడగానే ఒక్కక్షణం మనల్ని నిర్ఘాంత పరుస్తుంది…నివ్వెరపోయేలా చేస్తుంది…
చేష్టలుడిగి చూసాక కాస్త తేరుకుంటాం…అందులో బలైపోయినవారి గురించి ఆరా తీస్తాం…మనవాళ్ళు…వాళ్ళవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తాం. ఆ తర్వాతంతా మామూలే. ఆ ఘటనను జ్ఞాపకంగా మిగుల్చుతుంది కాలం. మన దైనందిన జీవితం కాలచక్రంలో పడి తిరుగుతూ…పోతూనే ఉంటుంది…
కానీ, ఆ దుర్ఘటనకు బలైన జీవితాలు, వారిపై ఆధారపడి జీవిస్తున్నవారు, వారి తాలూకూ జ్ఞాపకాలను మోసేవారు, ఎన్నటికీ ఆ ఘటనను మరవలేరు, వారి మనసుల్లోంచి ఆ చేదు జ్ఞాపకాన్ని చెరిపేయలేరు. తరాలు మారినా ఆ ఘటన తాలూకూ దుష్ఫలితాలను నివారించలేరు.
ఉదాహరణకు జపాన్ లోని నాగసాకి-హిరోషిమా. బాంబుదాడికి తునాతునకలైన నగరం…నిస్సారమైన భూమి. చిద్రమైన బతుకులు..అలాంటి ఘటనల ఆనవాళ్ళెన్నెన్నో చరిత్రలో.
ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయేది కూడా అలాంటి ఒక భయంకరమైన జ్ఞాపకం గురించే. అదే….భోపాల్ గ్యాస్ లీకేజ్…ఇది జరిగి సరిగ్గా నలభై ఒక్క ఏళ్ళు. ఇప్పటికీ కళ్ళముందు కదలాడుతున్నట్టే ఉంది…హాహాకారాలు హోరెత్తిస్తున్నట్టే ఉంది… భోపాల్ గ్యాస్ లీకేజ్ తాలూకూ దుష్ఫలితాలను ఆ ప్రాంతం ఇప్పటికీ అనుభవిస్తూనే ఉంది. ఆ భయంకరమైన జ్ఞాపకాలను మోస్తూనే ఉంది.
1984 డిసెంబరు 2 అర్థరాత్రి…మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనేట్ అనే విషవాయువు లీక్ అయింది. ఆ విషవాయువు పీల్చి, ఉక్కిరిబిక్కిరై, ఐదువేల మందికి పైగా మరణించారు. ఇది కేవలం అధికారిక లెక్క మాత్రమే. అనధికారిక లెక్కల ప్రకారం పదిహేను నుంచి ఇరవై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ప్రభావంతో ఐదు లక్షల మంది శాశ్వత వైకల్యం, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు.
ఆ రోజు పుట్టిన వేలాది మంది పిల్లలు శారీరక, మానసిక వైకల్యాలతో జన్మించారు.
ఇప్పటికీ మూడో తరం ప్రభావితమవుతూనే ఉంది. ఆ రాత్రి భోపాల్ నగరం మొత్తం గ్యాస్ ఛాంబర్ గా మారింది. ఆ దుర్ఘటన తర్వాత భారత్‌లో పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ రక్షణ చట్టం 1986 ఏర్పాటు చేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు బలోపేతం చేయబడ్డాయి. కానీ, ఈ ఘోరకలి నుంచి మనం ఏం నేర్చుకున్నాం? కాలుష్యాన్ని ఏ నియంత్రణ బోర్డులు కంట్రోల్ చేస్తున్నాయి? కాలుష్య కారకాలను ఎ చట్టాలు ఆపుతున్నాయి? పరిస్థితి మెరుగుపడడం సంగతి దేవుడెరుగు…నానాటికీ దిగజారుతోంది…ఆందోళన కలిగిస్తోంది.
పరిశ్రమల్లో పనిచేసేవారు ప్రాణాలరచేతుల్లో పెట్టుకుని విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. వాటిలో భద్రతా ప్రమాణాలను ప్రశ్నించేంత సామర్థ్యం ఎవరికీ ఉండడం లేదు. ఇక ఆయా పరిశ్రమలు పరోక్షంగా బాహ్య ప్రపంచానికి చేస్తున్న హాని తక్కువేం కాదు. ప్రపంచంలోనే అతి కలుషిత నగరంగా మన దేశ రాజధాని ఢిల్లీ రికార్డు సృష్టించింది. పవిత్ర నదులైన గంగ, యమునల్లో డెబ్భైశాతం పారిశ్రామిక వ్యర్థాలు ఇప్పటికీ కలుస్తూనే ఉన్నాయి.
అదే దారిలో మన దేశంలోని చాలా జీవనదులు పారిశ్రామిక కాలుష్యకోరల్లో చిక్కి విలవిల్లాడుతూనే ఉన్నాయి. ఆ నీరు తాగినా, పుణ్యం కోసం వాటిలో మునిగి పవిత్ర స్నానాలాచరించినా చర్మవ్యాధులు అంటుకుంటున్నాయి. ఆతర్వాత 2020 లో జరిగిన విశాఖ ఎల్.జీ పాలిమర్ లీక్ ఇద్దరు ప్రాణాలు కోల్పోగా వందల మంది అస్వస్థతపాలయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఘటనలెన్నో.
రోజురోజుకూ పెరుగుతోన్న ప్లాస్టిక్, రసాయన కాలుష్యం మానవాళిపై సవాల్ విసురుతూనే ఉంది. పరిశ్రమలు గాలిలోకి వదిలే పొగ, వాహనాల నుంచి వెలువడే పొగ, గాలి నాణ్యతను క్షీణింపజేస్తున్నాయి. కరోనా సమయంలో ధరించిన మాస్కులు నిరంతరం తప్పనిసరిగా ధరించాల్సిన రోజులొచ్చాయి. కాలుష్యభూతం నుండి తప్పించుకుని పారిపోవడం సాధ్యం కాదు కనుక, నివారించడం ఒక్కటే మార్గం. అందుకు జనచైతన్యం చాలా అవసరం. మనలో మార్పు అత్యంత అవశ్యం. మార్పు దిశగా అడుగులేయడం తక్షణ కర్తవ్యం. అందుకు ఏమేం చేయాలో ఒక్కసారి పరిశీలిద్దాం.
పరిశ్రమలు కొత్తగా స్థాపించేవారు, ఇప్పటికే పారిశ్రామిక రంగంలో ఉన్నవారు తమ పరిశ్రమలనుండి వెలువడే వ్యర్థాలను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవచ్చు. అందుకు సాంకేతికంగా చాలా కొత్త పద్దతులు అందుబాటులో ఉన్నాయిప్పుడు. అలా అప్ డేట్ చేసుకోవడం ద్వారా చాలవర్కు వాయు,జల కాలుష్యాలను నివారించవచ్చు.
జనాభాకనుగుణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అవసరమే. ఉద్యోగ, ఉపాధి కల్పనలు పరిశ్రమల వల్లనే సాధ్యం. కాలుష్యం కారణంగా పరిశ్రమలను మూసివేస్తే వందలాది ఉద్యోగులు రోడ్డున పడతారు. వారిమీద ఆధారపడ్డ కుటుంబాలు నిరాశ్రయులవుతారు. కనుక, కాలుష్యాన్ని నివారించడంలో పరిశ్రమల యజమానులు చొరవ తీసుకుని తమ పరిశ్రమలను అప్ డేట్ చేసుకుంటే ప్రజల ప్రాణాలను కాపాడినవారవుతారు. పర్యావరణానికి మేలు చేసినవారవుతారు.
ప్లాస్టిక్ తగ్గిద్దాం. కనీసం వారంలో ఒకటి రెండు రోజులు క్లాత్ బ్యాగ్ వాడదాం. వాహనాలు తక్కువ వాడదాం. కార్ పూలింగ్ లేదా ప్రజా రవాణాని ఉపయోగించుకుందాం. ఎక్కడ అవకాశముంటే అక్కడ మొక్కలను నాటుదాం. ఒక్క మొక్క కూడా గొప్ప మార్పు తీసుకొస్తుంది. భవిష్యత్తులో పర్యావరణాన్ని కాపాడుతుంది. పిల్లలకు కాలుష్యం ఎక్కడ నుంచి ఉత్పన్నం అవుతుందో వివరిద్దాం. నివారణా మార్గాలను అన్వేషిద్దామని సూచిద్దాం. కాలుష్యాన్ని ఉత్పన్నం చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకునేలా, ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేలా సోషల్ మీడియాలో చర్చలు చేద్దాం. అవగాహన, ఆలోచనలను రేకెద్దిద్దాం.
భోపాల్ దుర్ఘటన.. అది మన భవిష్యత్తుకు ఒక హెచ్చరిక! 41 ఏళ్ల క్రితం జరిగిన ఆ విషాదం మళ్లీ జరగకూడదంటే… ఈ రోజు నుంచి మనం మారాలి!
శుభ్రమైన గాలి, నీరు, భూమి కోసం కలిసి పోరాదాం! రాబోయే తరాలను రక్షించుకుందాం.
———————
30 Nov 2025 Sunday Magazine | 2.చెప్పుకోండి చూద్దాం.. ప్రశ్నలు
ఈ ఫోటోల్లో ఉన్నది ఎవరో చెప్పుకోండి చూద్దాం…


సమాధానాలు చివర్లో
30 Nov 2025 Sunday Magazine |3.ఆకలి చిరునామా

రోడ్డు అంతా నిర్మానుష్యంగా, చీకటిగా ఉంది అక్కడక్కడా వీధి దీపాలు వెలుగు తున్నాయి. ఓ అరుగుపై ఓ బిచ్చగాడు హాయిగా పడుకుని నిద్రపోతున్నాడు. విధి ఎంత విచిత్రమైనది. ఎవరిని ఎప్పుడు ఎలా వేధిస్తుందో ఎవరికీ తెలియదు ఇలా ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్నాడు వెంకట్రావు. కానీ బాగా ఆకలిగా, నీరసంగా ఉంది కాసేపాగితే పడిపోతానేమో అనిపించింది. ఏదోకటి ఎలాగోలా తినాల్సిందే అని నిర్ణయించుకున్నాడు.
ఆడిటర్ గా పని చేస్తున్న తనకు ఏమిటి ఇంత దుస్థితి అని ఆలోచిస్తూ తన భార్యతో రెండు రోజుల క్రితం జరిగిన సంభాషణ తదనంతర పరిణామాలు గుర్తొచ్చాయి. ఆఫీసు నుండి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ టీవీలో వార్తలు చూస్తున్న వెంకట్రావు కు “ఏమండీ శనివారం మన ఆమ్మాయి ఆశ్రిత పుట్టినరోజుకదా, మీరు ఆరోజు తప్పకుండా ఇంట్లో ఉండేలా చూడండి” హెచ్చరిస్తున్నట్లుగా చెప్పింది భార్య శ్రీ లత ఘుమఘుమలాడే కాఫీ ఇస్తూ.
“నాచేతిలో ఏముందిరా. ఆరోజు ఎక్కడ ఉంటానో బ్యాంక్ ఆడిట్ సెక్షన్లో పని చేసేటప్పుడు ఏరోజు ఎక్కడ ఉండాల్సివస్తుందో చెప్పలేము. అయినా తప్పకుండా ప్రయత్నం చేస్తాను” చెప్పాడు వెంకట్రావు. ” అలాకాదు మీరు తప్పకుండా సెలవు పెట్టాల్సిందే. దాని భర్త్ డే పార్టీ గ్రాండ్ పది వేలు ఖర్చుపెట్టి చెయ్యాలని నేను అది ప్లాను చేసాం. ఈసారి తన ఎనిమిదో క్లాసు స్నేహితులను, మన బంధువులను అందరినీ పిలిచి గ్రాండ్ గా చేయాలండి అభ్యర్ధనను, ఆర్డర్ను కలగలిపి చెప్పింది శ్రీలత.
“అలాగే చేద్దాం ” అంటూ టీవీలో మునిగిపోయాడు వెంకట్రావు కాఫీ తాగుతు.. “మర్నాడు ఆఫీసు నుండి ఫోను, రేపు ఏటూరినాగారం ఆడిటింగ్కు వెళ్ళమని. ఆ రాత్రి బయలుదేరి మరుసటి రోజు ఉదయం చేరాడు వెంకట్రావు. అది ఓపల్లెటూరు. వరంగల్లు నుండి దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు దూరం వుంటుంది. అంతా అడవి మార్గము. మండల కేంద్రం కావడంతో ఓ సినిమా హాలు, ఓ లాడ్జి ఉన్నాయి. ఓ రూం తీసుకుని రెడీ అయి ఆఫీసు కెళ్ళాడు. బ్రాంచ్ కెళ్ళాక తెల్సింది అక్కడ పని రెండు రోజులు పడుతుందని.
ఆరోజు పని అయ్యాక అక్కడి నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న భోగతా జలపాతంకు తీసుకెళ్ళారు ఆఫీసువాళ్లు. అది ఓ టూరిస్టు ప్లేసు. తప్పక చూడవలసిన ప్రాంతం. అక్కడ అన్ని ఋతువుల్లోనూ నీరు కొండలపై నుండి వస్తూ ఉంటుంది. చుట్టూ పచ్చని పొలాల మద్య చూడ చక్కని ప్రదేశము. ఎంతో మనోహరంగా ఉంటుంది.
సాయంత్రం రూం కు చేరుకుని అలా పడుకున్నాడు. ప్రయాణపు బడలికతో తెలియకుండానే బాగా నిద్రపట్టింది. నిద్ర లేచి చూసేసరికి రాత్రి 11 గంటలయింది. బాగా ఆకలిగా వుంది. బయట వర్షం పడుతున్నధి. ఓ అరగంట తర్వాత తగ్గింది. చిన్నగా బయలుదేరి బయటకెళ్ళాడు. హెూటల్స్ అన్నీ మూసి వున్నాయి. దూరంగా ఓ చిన్న టీ కొట్టు ఒకటి కనిపిస్తోంది.
గబాగబా వెళ్ళి” తినటానికి ఏమైనా వున్నాయా బాబు ” అడిగాడు వెంకట్రావు.” ” టీ ఉంది సార్ ఇంకేంలేదు ” చెప్పాడు వాడు. “కాదు బాబు చాలా ఆకలిగా వుంది ఎక్కడైనా ఏమైనా దొరుకుతాయా” అడిగాడు వెంకట్రావు. “ఈ సమయంలో ఏమీ దొరకవు. ఈ వూర్లో వర్షం పడితే షాపులన్నీ మూసేస్తారు సార్ ” చెప్పాడు ఆ షాపువాడు. వర్షం ఆగి పోయినా తుప్పర్లు పడుతూనే ఉన్నాయి.
ఇక షాపులు ఏమీ ఉండే అవకాశం కనపడటం లేదు. ఏంచేయాలో పాలు పోవడంలేదు. కడుపులో ఆకలి పెరిగిపోతోంది. టీ తాగి లాడ్జిరూంలోకి వెళ్ళాడు. పడుకున్నా నిద్ర పట్టడం లేదు. ఎప్పుడో మద్యాహ్నం తిన్న భోజనం తప్ప ఏమీ తినలేదు. ఆకలికి టీ ఏమూలకు రాలేదు. వెంటనే రూం బాయ్ను లేపాడు. బాబు బాగా ఆకలిగా వుంది. సుగర్ కూడా ఉంది. దగ్గరలో తినటానికి ఏమైనా దొరుకుతాయా ” అని అడిగాడు.
“రాత్రి తొమ్మిది దాటితే ఏమీ దొరకవు సార్. అందులో వర్షము పడితే అసలు ఏ షాపు ఉండదు చెప్పాడు వాడు.” “బయటకు ఎక్కడికైనా వెళ్ళే అవకాశం లేదా ” అడిగాడు వెంకట్రావు. “లేదు సార్ ఆటోలు కూడా ఏమీ వుండవు. ఉదయం ఐదు గంటలకే మొదలవుతా యి” చెప్పాడువాడు. ఆకలి తన పని తాను చేసుకు పోతోంది. అసలే మధుమేహం ఉన్నవాడిని.
కొంచెం సేపయితే నీరసం వస్తుందేమో, చెమటలు పడతాయోమో అనుకోగానే భయంవేసింది. అప్పటికే పన్నెండు దాటింది. అర్ధరాత్రి. అందునా ఒంటరిగా ఉన్న ఈ సమయంలో ఏమైనా జరిగితే ఎవరు దిక్కు అన్నింటికీ భగవంతుడే దిక్కు అనుకుంటూ పడుకున్నాడు. ఎప్పుడూ ఏదోకటి బ్యాగులో తినే వస్తువులు తీసుకుపొయ్యే అలవాటు. ఈరోజు హడావుడిలో మర్చిపోయ్యాడు.
అయినా బ్యాగు అంతా వెతికాడు బ్యాగులో పది వేలు డబ్బులు న్నాయి. తినటానికి ఏమీ దొరకలేదు. చొక్కా వెతికితే మరో అయిదు వేలున్నాయి. బాధ వేసింది. ఎంతోమంది ఆకలిగా ఉండి డబ్బులేక ఇబ్బంది పడుతుంటారు. కానీ తను డబ్బుండి ఆకలి తీర్చుకోలేని పరిస్థితి. అలాగే పడుకున్నాడు. దైవ ప్రార్థన చేస్తూ నిద్రపోవడానికి విశ్వప్రయత్నం చేశాడు. అరగంట గడిచింది. లాభం లేదు. సమయం చూస్తే ఒకటిన్నర అయింది.
సమయం భారంగా నడుస్తున్నట్లుంది ఆకలి ఎంత కఠోరమైనది. ఎంత భయం కరమైనది. ఏరోగంకైనా కొంత ఉపశమనం ఉంటుందేమోకాని ఆకలికి మాత్రం తినకపోతే ఉపశమనం లేదు. నిద్రపట్టనివ్వదు. వేధిస్తుంది. ఆకలి ఇంత భయంక రంగా ఉంటుందని అనుభవిస్తేకాని ఎవరికైనా తెలియదు అనుకున్నాడు వెంకట్రావు. అలా నడుస్తూ వుండగా ఏదో అరుపులు వినిపించాయి. ఆలోచనల నుండి ఈ లోకంలోకి వచ్చాడు.
అవి కుక్కల అరుపులు. రోడ్డుప్రక్కన ఉన్న ఓ చెత్త కుండీ దగ్గర అరుస్తున్నాయి. దానిలో పైనే అన్నం, పులిహోర, కూరలు పది మందికి సరిపడేంత పడవేసివున్నాయి. కడుపులో ఆకలి వుంది. ఎదురుగా వ్యర్ధంగా పడవేసిన ఆహారంవున్నా తినలేని పరిస్థితి. ఇటువంటి దుస్థితి ఎవరికీ కలుగకూడదు అనుకున్నాడు వెంకట్రావు. గత సంవత్సరం తన పుట్టిన రోజుకి లత అందరినీ పిలిచి గ్రాండ్ గా చేసింది.
పది రకాల పలహారాలు, భోజనం ప్లేటు నాలుగు వందల ఖర్చుతో ఏర్పాటు చేశాము. అనుకున్నంత మంది రాకపోవడంతో ఇలాగే వృధాగా పడవెయ్యవలసి వచ్చింది. అలా ఆలోచిస్తూ నడుచుకుంటూ ముందుకువెళ్ళాడు. ఆవీధి చివర ఓ హెూటల్ బండి కనిపించింది. దానిప్రక్కనే మంచంపై పడుకుని నిద్ర పోతున్నారు ఓ ముసలి దంపతులు. ముసలాయన దగ్గరకు వెళ్ళి ” తాతా ఓసారి లేస్తావా. బాగా ఆకలిగా వుంది.
తినటానికి ఏమైనా వుంటే చూడు”. అడిగాడు వెంకట్రావు. “ఈరోజు ఏమీ మిగలలేదు బాబు. మరో గంటలో టీ పెడతాం” అన్నాడు మంచం పై నుంచే. ” కాదు తాతా రాత్రి వర్షం పడటంతో ఏమీ తినలేదు. ఆకలిగా వుంది”. అన్నాడు వెంకట్రావు.” పక్కనే పడుకున్న భార్యను లేపి అడిగాడు “ ఏమే ఏమైనా ఉన్నాయా తినటానికి” అన్నీ ఆలకిస్తున్న ఆమె లేచి “మా అబ్బాయి వరంగల్లు నుండి వస్తాడేమోనని గంజి నీళ్ళు దాచి వుంచాను. వాడు రాత్రి రాలేదు. ఏమీ అనుకోకుండా తాగుతారా బాబు” అడిగింది. సరేనన్నట్లు తలూపాడు.
లేచి వెళ్ళి గ్లాసులో తీసుకొచ్చి చేతికిచ్చింది. ఒక్క క్షణం ఆగు బాబు అంటూ లోపలికెళ్ళి గోంగూర పచ్చడి తెచ్చి ఓ ప్లేటులో పెట్టి అక్కడ పెట్టింది. “ఇది నంచుకుంటూ తిను బాబు. మా అబ్బాయికి ఇలా తినటంచాలా ఇష్టం అని చెప్పి మంచంపై కూర్చుంది.” “సరే అవ్వా” అంటూ గోంగూర నంచుకుంటూ కొంచెం గంజి రుచి చూశాడు. అమోఘం అద్భుతం ఇది గంజి కాదు. అమృతం. అమృతం కూడా ఇంత బాగా ఉండకపోవచ్చు. ఒక్క నిమిషంలో త్రాగేశాడు. ” ధ్యాంక్యూ అవ్వ నాకు ప్రాణం పోశావు” అంటూ అవ్వ చేతిలో వందరూపాయలు పెట్టబోయాడు డబ్బు తీసుకోలేదామె.
“వద్దు బాబు వద్దు అది మా అబ్బాయి కోసం వుంచాను. వాడు రాకపోవడం వల్ల మిగిలింది. అది నీకు ప్రాప్తం వుంది” అంటూ నవ్వింది అవ్వ. “పోన్లే బాబు వృధా కాకుండా ఎవరోకరికి ఉపయోగపడింది.చాలా సంతోషం బాబు” అన్నాడు తాత. రూంకి వచ్చి పడుకున్నాడు. అవ్వ తాత మాటలే గుర్తుకొస్తున్నాయి. “మా అబ్బాయికి గోంగూరతో గంజి ఎంతో ఇష్టం. అది నీకు ప్రాప్తం బాబు” అంది ముసలవ్వ. ” వృధా కాకుండా ఉపయోగపడటం ఎంతో సంతోషం” అన్నాడు పెద్దాయన. అవునుగదా .
ఆ చెత్త కుండీలో పదిమందికి పైగా సరిపడే అహార పదార్థాలు పడవేశారు. ఆకలి లేని వారికి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా ఉపయోగం లేదు. ఆకలిగా ఉన్నవారికి గంజినీళ్ళు ఇచ్చినా చాలు. కొన్ని ప్రాణాలు నిలిపినవారమవుతాం. ఇలా ఆలోచిస్తూ నిద్రపోయాడు వెంకట్రావు. మరునాడు ఆడిటింగు పూర్తి చేసుకొని ఇంటికి చేరాడు. ఇంటికి చేరగానే భార్య లతతో చెప్పాడు “మన అమ్మాయి పుట్టిన రోజు ప్రత్యేకంగా చేసుకుందాం.
అతిధులు మన ఇంటికి రావటం కాకుండా మనమే అతిధుల వద్దకు వెళుతున్నాం. అలాగే అమ్మవారి గుడికి కూడా తీసుకెళతా అన్నాడు.” గుడి అనేసరికి శ్రీలత మారుమాట్లాడకుండా ఒప్పేసుకుంది. ముందుగా వెళ్లి మంచి హెూటల్లో భోజనం పాకెట్లు ఆర్డరిచ్చాడు. పదిగంటలకల్లా బయలుదేరి కార్లో అమ్మవారి గుడికి తీసుకెళ్లాడు. గుడిలో పూజ అయిపోయేసరికి పన్నెండు అయింది.
హెూటల్కు ఫోన్ చేశాడు. పది నిమిషాల్లో భోజనం పాకెట్లు గుడిమెట్ల దగ్గరకు చేరాయి. గుడి ముందు మెట్లపై బిచ్చగాళ్లు ఓ యాభై మంది దాకా ఉన్నారు. ఆశ్రిత చేత అందరికీ తలో పాకెట్ ఇప్పించారు. మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు. గబాగబా విప్పేసి తినేశారు. వాళ్లందరినీ చూస్తే ఎంతో ఆనందం వేసింది. “అయ్యా, చాలా రోజులు తర్వాత కడుపునిండా తిన్నాం.
మీరంతా చల్లగా వుండాలయ్యా దీవిస్తూ ఓ పెద్దావిడ వెళ్లింది. “ఎంతమంది ఆకలి తీర్చావమ్మా. అన్నపూర్ణమ్మ తల్లి, నీకు ఎప్పుడు మంచే జరుగుతుంది”పాపను నవ్వుతూ దీవించింది మరొకామె. ” ఆకలి తీర్చావు తల్లి ఈరోజుకు దిగులు లేదు. ఆ దుర్గమ్మ తల్లి నిన్ను చల్లగా చూస్తుంది” అంటూ వెళ్లాడు మరో పెద్దాయన. అన్నీ వింటున్న వెంకట్రావు భార్య ఆనందభరితురాలై “భలే మంచి పని చేశారండి.
ఇదే నిజమైన గ్రాండ్ పార్టీ. మామూలుగా ఎంత ఖర్చు చేసినా ఇంత ఆనందంగా వుండేది కాదు “అంటుంటే వెంకట్రావు ఆనందానికి అవధుల్లేవు. పాపకు చాలా సరదాగా, సంబరంగా ఉంది. “నాన్నా ప్రతి సంవత్సరం ఇలానే చెయ్యాలి.” అంది సంతోషంగా. ఇంతలో అక్కడ ఉన్నవాళ్లలో ఒకాయన దగ్గరగా వచ్చి “సార్ ఈ పక్క సందులో వృద్ధాశ్రమమం వుంది. అక్కడ చాలా మంది ఇక్కడకు రాలేని ముసలివాళ్లున్నారు. మేమే వాళ్లకు మిగిలినవి ఇస్తుంటాం. రండి మీకు వాళ్లను చూపుతాను. వాళ్ల ఆకలి తీర్చినవారవుతారు. ” అన్నాడు. “పదండి ” అంటూ వెంట నడిచారు ఆకలి చిరునామా వెతుక్కుంటూ వెంకట్రావు కుటుంబం సతోషంగా..
———————
30 Nov 2025 Sunday Magazine | 4.మనసు-మాట శీర్షిక

నా పేరు సూర్య. నాకు 40 సంవత్సరాలు. పెళ్లయ్యి 13 సంవత్సరాలు, మాకు ఒక పదేళ్ల బాబు వున్నాడు. నేను వృత్తి పరంగా మంచి స్థానంలో వున్నాను, జీవితంలో ఇంకే విషయం లో లోటు లేదు ఒక్క విషయం తప్ప. అదేంటంటే నాకు-శ్వేతకు మధ్య జరిగే తగువులు. నేను తగువులవుతున్నప్పుడు నిశబ్దం మంచిది అని అనుకుంటాను తను మాత్రం మాట్లాడకపోతే తగువు ఎలా తీరుతుంది అని అంటుంది. ఆ సమయంలో వద్దు తర్వాత మాట్లాడదాము అని అంటే తరువాత నువ్వు అసలు మాట్లాడవు, తగువు తీరదు, ఇప్పుడే మాట్లాడాలి అని అంటుంది. ఆ నిమషంలో నాకు ఎం మాట్లాడాలో తెలియదు, తన మాటలు, రియాక్షన్స్ చూసి ఏమంటే ఏమవుతుందో, తను హర్ట్ అవుతుందేమో అన్న భయం అలాగే ఎలా మాట్లాడాలో అన్న సంకొంచెంతో వుంటాను. నాకు భావొద్వేగాలు అంటే భయం. చినప్పటి నుంచీ నాకు నిశబ్దం అలవాటు. నన్ను చూసి మా బాబు కూడా అదే నేర్చుకుంటున్నాడు. మనసులో ఏముందో చెప్పడు. మేము ఈ సమస్య ఎలా తీర్చుకోవాలి?
సైకాలజిస్ట్ మాట: ఒక వ్యక్తి తన బంధాలలో ఉత్పన్నమయ్యే భావొద్వేగాలను తన మెదడులో ఉన్న ఎమోషనల్ పెర్సెపటివ్ సెంటర్స్ ద్వారా అర్థం చేసుకుంటారు. అలాంటప్పుడు తన భావాలను అనుభవించడానికి నిరాకరించినప్పుడు, ఇతరుల భావాలకు సంబంధించిన వివరాలను ఎలా స్వీకరిస్తారు అలాగే వాటిని ఎలా అర్థం చేసుకోగల్గుతారు?
చిన్నప్పటి నించి మగవారిని భావాలను వ్యక్తికరించనివ్వము. ఏడుస్తే అమ్మాయి లా ఏడుస్తన్నావు ఏంటి అంటాము, భావాలు వ్యక్తపరచాలనుకున్నపుడు అంత సున్నితంగా ఉండకూడదు, స్టే స్ట్రాంగ్, బి ఏ మాన్ అంటాము. కోపం, అగ్గ్రెషన్, ఆల్కహాల్ ఓకే అంటాము. భావాలను గుర్తించడము, అనుభవించడం మరియు వ్యక్తపర్చడం చిన్నప్పటి నుంచీ నేర్పించాలి ఆలా నేర్పించినప్పుడే వాళ్లు బంధాలలో నిశబ్దం, కోపం, వైయలెన్స్, హేళన చేయడం, ఎదుట వాళ్ళని కించపర్చే హాస్యము, వీడి భావాలను ఆరోగ్యంగా వ్యక్తపరచడమే కాకుండా మరియు ఇతరుల భావొద్వేగాలను అర్థం చేసుకోగలిగే ఓర్పు నేర్చుకుంటారు.
పురుషులు మరియు స్త్రీల మధ్య భావోద్వేగ వ్యక్తికరణలో తేడాలు ఏంటంటే.
- స్త్రీల ఏంపతీతో మాట్లాడే శైలి పురుషుల మరింత తార్కిక మరియు సమస్య-పరిష్కార విధానం మధ్య కలిగే ఘర్షణ వలన అపార్థాలు టాలెత్తుతాయి
- పురుషుల బెదిరింపులు లేదా సవాళ్లకు మరింత దూకుడుగా స్పందించే ధోరణి స్త్రీ ల లో భావోద్వేగ ప్రతిస్పందనకు దారితీస్తుంది.
- పురుషుల భావోద్వేగాలను వ్యక్తపరచడంలో ఇబ్బంది వలన స్త్రీలలో నిరాశ మరియు అస్పష్టత భావాలు, సంఘర్షణలను పరిష్కరించడం కష్టతరం చేస్తుంది.
సూర్యకి సూచనలు
- మీ ఇద్దరు కూడా పరస్పర ఆందోళనలు మరియు అవసరాలను శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయాలి. యాక్టీవ్ లిసనింగ్ స్కిల్స్ పెంచుకోండి
- “నేను” ప్రకటనలను ఉపయోగించండి: ఒకరినొకరు నిందించడం లేదా ఆరోపించడం కంటే, భావాలు మరియు అవసరాలను వ్యక్తపరచడానికి “నేను” ప్రకటనలను ఉపయోగించండి.3. భావోద్వేగాలు ఎక్కువగా ఉంటే, విరామం తీసుకొని స్థిరంగా ఉన్నప్పుడు సమస్యను పునఃపరిశీలించండి.
4.గెలవడానికి కాక, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాన్ని కనుగొనండి. - సమస్యపై మీరు అంగీకరించకపోయినా, ఒకరి భావోద్వేగాలను అంగీకరించండి మరియు గౌరవం చూపించండి.
ఇద్దరిలో ఉన్న వ్యక్తిగత తేడాలను(individual diferences) అర్థం చేసుకోవడం, మరియు వాటిని గౌరవించడం ద్వారా, జంటలు సమర్థవంతమైన సంఘర్షణ పరిష్కారాలు కనుగొంటారు తద్వారా పరస్పరం ఇద్దరి మద్య పెరిగే నమ్మకం బంధాన్ని బలపర్చడమే కాకుండా బంధాన్ని ఆనంద దాయకం చేస్తుంది.
మైండ్ వాయిస్: ఈ మాటలు పదే పదే మీ మనసులో చెప్పుకోండి సూర్య 1. నా భావాలని వ్యక్తపరిచే ఓర్పు మరియు నైపుణ్యం వున్నప్పుడే నా భార్య భావాలు అర్థం చేసుకోగల్గుతాను. 2.మార్పు నాతోనే మొదలవుతుంది. 3. నా భావాలను వ్యక్తపరిచినప్పుడే నా కొడుకుకి భావ వ్యక్తీకరణ నేర్పించగలుగుతాను
గమనిక: గొప్యత కోసం క్లయింట్ వివరాలు మరియు కదా కొంత మార్చబడింది
———————
30 Nov 2025 Sunday Magazine | 5.కబుర్లు – శీర్షిక

మాటలతో ఆటలు
ఎవరో ఒకరు పుట్టించకపోతే భాష ఎలా పుడుతుంది? అంటాడు మాయాబజారు సినిమాలో ఎస్వీఆర్ ఘటోత్కచుడి అవతారం ఎత్తేసి. భాష అంతస్సారం రాక్షసజాతికే వంటబట్టగా లేనిది, జీవకోటిలో ఉత్కృష్టమైందని గొప్పలు పోయే మనిషి బుర్రకు తట్టకుండా ఉంటుందా? ఇహ, ఆవుకు కూడా ‘కొమ్ము’ తగిలించే మన తెలుగుభాషలోని మాటల తమాషా సంగతి బుర్రకు తట్టినవి.
అసల తట్ట అంటేనే వెదురును ముక్కలు ముక్కలుగా చేసి కళ ఉట్టిపడేటట్లు అల్లే ఒకపాత్ర. తాటాకు చెట్టు నుంచి వస్తుంది కాబట్టి తట్ట అయిందేమో!అలాగె మింగే లక్షణం గలది కాబట్టే తిమింగలం అయిందా?
పాలిటిక్సులోకొత్తగా ఎంట్రీ రోజుల్లో ఎన్.టీ. రామారావును ‘ఎమ్టీ రావు’ అని కాంగ్రేసోళ్ళు ఎద్దేవా చేసేవాళ్లు. తీరా ఆ దఫా జరిగిన ఎన్నికల రేసులో కాంగిరేసువాళ్ళలో చాలా మందికి ఆ కనీసం ధరావత్తులు కూడా ‘రావు’ అనే దుస్థితి వచ్చిపడింది. బెంగాలీబాషలో‘బా‘ అన్నా ‘వా‘అన్నా ‘పో.. పో’ అని ఒకే అర్థం. మీద మీదకు వచ్చే అక్కమొగుడిని కసిరికొట్టే సందర్భంలో‘బా.. వా‘ అని ఉంటుంది.
ఆ మాటే చివరకు అక్క మొగ్గుళ్లందర్నీ ‘బా.. వా’ లుగా సుప్రసిద్ధం చేసేసింది తెలుగుభాష. కాల్షియం సమృద్ధిగా ఉంటేనే మనిషిలో పెరుగుదల సక్రమంగా ఉంటుంది- అంటారు ధన్వంతురులు. ఆ ధాతువు అధిక పాళ్లలో ‘పెరుగు’దొరుకుతుంది. అందుకే దానికి ‘పెరుగు‘పేరు స్థిరపడింది. ధన్వంతురుల అన్న మాట ఎలాగూ వచ్చింది కాబట్టి ఒక చిన్న ముచ్చట. ధనం మాత్రమే తన వంతన్న దీక్షగాచికిత్స చేసే వైద్యనారాయణులు కద్దు. ఆ మహానుభావులకుధన్వంతురులు చక్కగా సూటవుతుంది.అలాగే ఫీజ్ ను బట్టి వైద్యం చేసేఫిజీషియన్ ని ‘ఫీజీషియన్‘ అనడమే సబబు.
రైయ్యిమని దూసుకుపోతుంది కనక రైలుబండి అయినట్లు మని, అన్నా ‘షి’ అన్నాపడిచస్తాడు కనక మనిషి ‘మని-షి’గా తయారయ్యాడు.
ఎంత రాసినా గుర్తింపు లేక నీరసం వచ్చేసిన కవులు కట్టే గ్రూపు‘అ-రసం’ అని ఎద్దేవా చేయవచ్చు కాని ఆ సంఘ సంభ్యులందరూ సుప్రసిద్ధ అభ్యుదయ రచయితలు కావటాన ఆ మాట చెల్లదు.
ఆడమన్నట్లా ఆడేది ‘ఆడది’ అనే దురభిప్రాయం ఇటీవలి కాలం దాకా చెల్లుబాటు అయింది. మగువను చూస్తే ‘గాడు’ (తీపరం) పుట్టే జీవి కావడం మూలాన మగాడు మగాడు అనవచ్చా?‘క్షీరధార’లా కవితాధారను కురిపించే కవులు ఉంటారు. ఆ రకమైన కవులను సాహితీక్షేత్రంలోమసిలే ‘కౌ’లు (cows)గా మన్నించినా తప్పుకాదు.వివిధ రంగాలలోని మెరికలు పోగయ్యే దేశం కాబట్టి యూఎస్ఏ అమెరికాగా ప్రసిద్ధిపొందిందా?! అట్లాగని ఆస్ట్రేలియాలో అంతా ‘స్ట్రే’ డాగ్సులా తిరుగుతారనుకుంటే ప్రమాదం.
‘స్టే‘ కూడా దొరకని క్రిమినల్ కేసుల్లో బుక్కయిపోవచ్చు.అరబ్ కంట్రీసు పేరు ‘ఐ రబ్ విత్ యూ’ అంటూ బలాదూరుగా తిరిగితే..రాళ్ళ దెబ్బలతో చావు వచ్చి పడచ్చు. న ప్లస్ ఇతి ఈజ్ ఈక్వల్ టు ‘నేతి’ రా నాయనల్లారా!‘న-ఇతి’ అంటే ‘ఇది కాదు’ తెలుగర్థం. ఆ పదాన్ని పట్టుకునొచ్చి నేతి బీరకాయలో నెయ్యి లేదని ముక్కు చీదుకోడంతగదు. ఎలుకకుచిలుకకుఒక్కపేరులోతప్ప పోలిక లేదు.
టమోటోకిటయోటాకి మాటలో తప్ప రేటులోఒకేలా ఉండదు. పదాలున్నాయి కదా పదార్థాల కోసం దేవులాడితే వృథా ప్రయాసే! ‘ఎలాగూ’లో ఏ ‘లాగూ‘ కోసం వెతికినాప్రయోజనం ఉండదు. . మైసూర్ బజ్జీలో మైసూరు కోసం వెదికి ఉసూరుమనద్దు! ఆఖరి మాట ఏంటంటే పదాలలో పోలికలున్నంత మాత్రాన పద+ అర్థాలు ఒకేలా ఉండవు. ఒనే అర్ధం ఉన్న పదాలు ఏవీ ఒకేలా పలకవు.
———————
30 Nov 2025 Sunday Magazine | 6.సన్నిహితం… శీర్షిక

ఇంట్లో ఇది నిషేధం..
సూర్య ఆఫీసు నుండి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికీ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. చిన్నగా నవ్వుకుని చుట్టూ చూశాడు. బెడ్రూం లో భార్య తన సెల్ ఫోన్ లో మునిగి ఉంది. ఇంకో బెడ్ రూంలో పిల్లలు బుద్ధిగా క్రమశిక్షణ తో తమ పనిలో తాము మునిగి ఉన్నారు. అంటే వాళ్ళు చదువుకుంటున్నారు అని కాదు.సెల్ ఫోన్ చూడటంలో డిసిప్లిన్ గా ఉన్నారు అని. సూర్యకు తన బాల్యం గుర్తుకు వచ్చింది.
అప్పట్లో తనలాంటి చిన్న పిల్లలందరూ గోల గోల చేసేవారు. ఇల్లు పీకి పందిరి వేసేవారు. ఈ గోల భరించలేక పెద్దవాళ్ళు విసుక్కున్నా కూడా తర్వాత ముద్దు చేసేవారు. అల్లరి పిల్లలు కాక పెద్దలు చేస్తారా అంటూ మురిసిపోయారు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళని మాటి మాటికి ఏదో ఒకటి అడగడం వాళ్ళు విసుక్కుంటూనే సమాధానం చెప్పడం ఆలనా పాలనా చూడటం ఇలా ఆ వాతావరణం ఎంతో హృద్యంగా ఉండేది.
అందరూ కష్టం సుఖం పంచుకునేలా ఉండేది. పిల్లలకు ఆ విధంగా ఒక బాధ్యత అనుబంధాల విలువ నేర్పెట్టుగా ఉండేది పెంపకం. కానీ ఈ రోజుల్లో సెల్ ఫోన్ లో మునిగి పోయి పిల్లలు పెద్దలు ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు. పక్కవాళ్ళని పట్టించుకోవడం లేదు. ఇక అనుబంధాలు ఎలా పెరుగుతాయి ఆప్యాయతలు ఎలా ఉంటాయి అందుకే సూర్య ఒక నిర్ణయం తీసుకున్నాడు.
అది – ఇంట్లో కొన్ని సమయాల్లో సెల్ ఫోన్ వాడకం నిషేధించాలి అని. ఇది మంచి నిర్ణయమే కదా ..ఏమంటారు మీరు!!!
———————
Sunday Magazine 30 Nov | 7.మెదడుకు మేత-సామెత.. శీర్షిక

అంగట్లో బెల్లం – ఆత్మలో విషం
కపట ప్రవర్తనను కడిగిపారేసే సామెత ఇది. లోపల ఒకటి, బయట ఒకటి పెట్టుకుని వ్యవహరిస్తుంటారు చాలామంది. వీరిని ఇంగ్లీషులో ‘హిపోక్రాట్స్’అంటారు. ఈ గుణాన్నిహిపోక్రసీ అంటారు. ధర్మరాజును అజాతశత్రువు అంటారు. ఆ బిరుదు ఆయనకొక్కడికే ఉంది. అంతటి వాడిని పట్టుకొని వేమన గారేమన్నారో చూడండి.
ఆ.వె.:
కులము నీరు జేసె గురువును జంపించె పొసగ యేనుగంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెను వేప విత్తయా విశ్వదాభిరామ వినుర వేమ!
యుద్ధంలో ఒక ఏనుగు చచ్చిపోయింది. దాని పేరు అశ్వత్థామ. ద్రోణాచార్యుల వారి కొడుకు పేరు కూడా అదే. ఆ మహా ధన్విని ఎవరూ చంపలేరు, ఆయనంతట ఆయనే అస్త్రసన్యాసం చేస్తే తప్ప! అప్పుడు ధర్మరాజు “అశ్వత్థామా హతః” అని బిగ్గరగా అరచి, “కుంజరః” (ఏనుగు) అని వినీ వినబడకుండా చెబుతాడు. కొడుకు చనిపోయాడని, ద్రోణుడు కుప్పకూలతాడు. ధర్మరాజు చెప్పిన అబద్ధం ‘యేనుగంత’ అనడంలో ఔచిత్యంతో పాటు గడుసుదనముంది. పెను వేప విత్తు అని రూపకాలంకారం వాడాడు.
అంటే విషంతో (చేదు) నిండినవాడని. వేమన ఎవరినీ వదలడండోయ్. “మెత్తని పులి ధర్మజుండు” అంటాడు సంజయుడు.
‘నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తుంటాడు’అనేది కూడా ఇలాంటిదే.Transparency (పారదర్శకత) అనేది ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం. మహమ్మదు ప్రవక్త కపటాన్ని తీవ్రంగా నిరసించాడు. ‘కపటి’కి మూడు లక్షణాలున్నాయన్నాడు ఆయన.1) మాట్లాడితే చాలు, అబద్ధమాడుతాడు 2) చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడు 3) తనను నమ్మిన వారిని నట్టేట ముంచుతాడు.
ఈ లక్షణాలను చదువుతూంటే మనకు ఎవరో గుర్తొస్తున్నారు కదా! ఇంకెవరండీ బాబూ మన పాలిటీషియన్లు! హిపోక్రసీకి వీళ్లు బ్రాండ్ అంబాసిడర్లు. ఎక్కడో అరుదుగా మంచివారు, పారదర్శకమైన వ్యక్తిత్వం కలవారు ఉంటారనుకోండి, పాపం వారు మైనారిటీలు! (అంటే సంఖ్య తక్కువని!)
ఆత్మగౌరవం బాగా తక్కువ ఉన్నవాళ్లే హిపోక్రాట్స్‌గా ఉంటారని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటారు. ప్రతివారూ ఎప్పుడో ఒకసారి కపటాన్ని అవలంబించ వలసివస్తుందట. దీన్ని లౌక్యం అనీ strategy అనీ వ్యక్తిత్వవికాస నిపుణులు అంటున్నారండోయ్! తనను అందరూ ఇష్టపడాలనీ బలమైన కాంక్ష కూడా హిపోక్రసీకి కారణమట. కపటత్వాన్ని పండితుల భాషలో చెబితే ‘అభిజ్ఞావైరుధ్యం’అవుతుంది. ‘పిల్లి అంటే మార్జాలము’అని చెప్పినట్లుంది కదా! సారీ సార్!
‘కపట నాటక సూత్రధారి’అని శ్రీకృష్ణపరమాత్మనే అన్నారు. కాని ఆయన ఆడించిన కపట నాటకమంతా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం, లోక కల్యాణం కోసమే కదా! ఇదే పేరుతో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కూడా వచ్చేసింది! బ్యాంకుల్లో గోల్డ్ లోన్‌ల కుంభకోణం ఇతివృత్తం.
అంతా పారదర్శకంగా, అబద్ధాలే చెప్పకుండా బ్రతకడం కూడా ఈ రోజుల్లో కష్టమే. హిపోక్రసీని మన జీవితంలో ఉప్పుగా వాడాలంటాను నేను. మీరమంటారు? ఉప్పు ఎక్కువైతే కూర తినలేం. హిపోక్రసీ ఎక్కువైతే మన జీవితం (ఇతరులకూ) దుర్భరమవుతుంది.
ఎమ్.ఐ. కిషన్ అనే రచయిత ‘హరిశ్చంద్రుడు అబద్ధమాడితే?’అనే నవల రాశారు. వంశీగారు దాన్ని ఆధారం చేసుకొని ‘ఏప్రిల్ 1 విడుదల’అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ‘అబద్ధాలతోనూ లౌక్యంతోనూ ఆనందంగా బ్రతికే దివాకరం పాత్ర’ను అనన్యసామాన్యంగా పోషించారు. తాను అతన్ని ప్రేమించాలంటే ఒక నెల రోజుల పాటు అబద్ధాలు చెప్పకుండా, నిజాలు మాత్రమే చెబుతూ ఉండాలని షరతు పెడుతుంది హీరోయిన్. ‘హిపోక్రసీ’అనేదే లేకుండా అన్నమాట. దాని వల్ల పెద్ద గందరగోళం నెలకొంటుంది.
కాబట్టి కామ్రేడ్స్! హిపోక్రసీ అనేదే లేకుండా బ్రతకాలంటే కష్టం. అలా అని జీవితమే హిపోక్రసీ కాకూడదు. సో, ‘నొప్పింపక, తానొవ్వక’తప్పించుక తిరుగుతూ, ధన్యులు కండి! ఆ మాత్రం కపటం లేకపోతే బండి నడవదు మరి! ఇదేమిటి హిపోక్రసీని సమర్థిస్తున్నాడు అని అనుకోకండి. నిజం నిష్ఠూరం గానే ఉంటుంది.
ఇంకో సామెతతో వచ్చే వారం కలుద్దాం!
———————
Sunday Magazine 30 Nov | 8.వినరో భాగ్యము – శీర్షిక

తిరుమలేశుని సంస్థాన పరిధి
తిరుమల క్షేత్రంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆస్థాన వరిధి ఏడుకొండలనే విషయం అందరికీ తెలిసిందే. లభించిన శాసనాధారాల ప్రకారం తూర్పుదిశలో వెంకట గిరి శ్రీకాళహస్తి రాజ గోపురం, దక్షిణ దిశలో నారాయణవనం కార్వేటి నగరం, వడమర దిశలో వాయల్పాడు ప్రాంతంలోని దేవరకొండ, ఉత్తరదిశలో రాయచోటి ప్రాంతం లోని ఎర్రగుండ్లపల్లె శ్రీవారి సంస్థాన ఎల్లలుగా నిర్దేశించారు. ఇప్పటికీ ఆ సరిహద్దు ప్రాంతాల్లో శంఖచక్రముద్రలతో కూడిన మూడడుగుల రాతి ఫలకాలు కనిపిస్తుంటాయి.
మరిన్ని తిరుమల విశేషాలతో మళ్ళీ వచ్చేవారం Sunday Magazineతో కలుద్దాం.
Sunday Magazine 30 Nov |9.చెప్పుకోండి చూద్దాం సమాధానాలు


మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@gmail.com

