TG | అంగన్ వాడీలకు జీతాలు తగ్గింపు.. రేవంత్ పై హరీశ్ ఫైర్

హైదరాబాద్ : మినీ అంగన్వాడీలు ప్రచార సాధనాలు కాదు.. వారికి నిజమైన గౌరవం కావాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం మినీ అంగన్వాడీల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలున్నారని, వీరంతా మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అత్యంత పేదవర్గాలకు అంకితభావంతో సేవలు అందిస్తున్నారని తెలిపారు.
మినీ అంగన్వాడీల కష్టాలను గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 5న వారికి అంగన్వాడీలుగా పదోన్నతి కల్పిస్తూ జీవో జారీ చేసిందన్నారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఉత్తర్వులు అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం చేసి మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా గుర్తిస్తూ మొదటి సంతకం చేశారని గుర్తుకు చేశారు.
2023 డిసెంబర్ 15న ఇదే విషయంపై జీవో కూడా జారీ చేశారని తెలిపారు. కానీ, అది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో, దాన్నే కాపీ కొట్టి కొత్తగా ప్రచారం కోసం విడుదల చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారని విమర్శించారు. 2024 జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలు అంగన్వాడీ పే గ్రేడ్‌లో రూ.13,650 జీతం చెల్లించిన ప్రభుత్వం, ఆ తర్వాత మినీ అంగన్వాడీ జీతం రూ.7,800కి తగ్గించి, 2025 ఏప్రిల్ వరకు అదే జీతం చెల్లించిందని వివరించారు.ఈ విధంగా మూడు నెలలు మాత్రమే పెంచిన జీతం ఇచ్చి గత ఏడాదిగా పాత జీతానికే పని చేపించుకున్నారని ఆరోపించారు. జీతాన్ని 13,650 రూపాయల నుంచి తిరిగి 7,800కి తగ్గించడం దారుణమన్నారు. పెంచిన జీతాలను తగ్గించే కొత్త సాంప్రదాయానికి తెర లేపిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదేమో అని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న మహిళల కడుపు కొట్టిందని ఆరోపించారు. మే నెల జీతాన్ని 8 జిల్లాల్లో మాత్రమే ఇచ్చి మిగతా జిల్లాల వారిని ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. జనవరి 2024 నుంచి 12 నెలలకు పెరిగిన జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలుగా మారిన ప్రతీ చోట హెల్పర్లను నియమించాలని, మే నెల పెరిగిన జీతాలు అందని జిల్లాల్లో తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
