2వ వార్డులో నిచ్చకోల వంశీకృష్ణ ప్రచార ప్రభంజనం

గెలుపే లక్ష్యంగా ‘బ్యాటు’ గుర్తుతో ముందడుగు
బెల్లంపల్లి, ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి 2వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి నిచ్చకోల వంశీకృష్ణ ప్రచారం అత్యంత ఉత్సాహంగా సాగుతోంది. వార్డులోని ప్రధాన వీధుల గుండా సాగుతున్న ఆయన ప్రచార ర్యాలీలకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. శనివారం వార్డులోని పలు కాలనీల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ, తన ఎన్నికల గుర్తు అయిన ‘బ్యాటు’ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా వంశీకృష్ణ మాట్లాడుతూ..
2వ వార్డు సమగ్ర అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. వార్డులో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ముఖ్యంగా వార్డులోని ప్రతి గల్లీలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు, మురుగునీటి సమస్య తలెత్తకుండా శాశ్వత ప్రాతిపదికన అధునాతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ర్యాలీ పొడవునా యువకులు, మహిళలు వంశీకృష్ణకు ఘనస్వాగతం పలికారు.
ప్రజల కోసం తపించే వ్యక్తిగా, స్థానికంగా అందరికీ పరిచయమున్న నాయకుడిగా వంశీకృష్ణకు వార్డులో మంచి ఆదరణ లభిస్తోంది. నిచ్చకోల వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకోవడం ద్వారా వార్డు అభివృద్ధికి నాంది పలుకుతామని స్థానిక ప్రజలు, నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో వందలాది మంది యువకులు, అభిమానులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వంశీకృష్ణకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.
