లక్ష్మారెడ్డి సేవలు చిరస్మరణీయం

ఉట్నూర్, ఆంధ్రప్రభ: పీఆర్‌టీయూ మాజీ జిల్లా గౌరవాధ్యక్షుడు, మాజీ ప్రధానోపాధ్యాయుడు దివంగత ఎం. లక్ష్మారెడ్డి ఉపాధ్యాయ వృత్తికి చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ జెడ్పీటీసీ సూర్యప్రకాశ్ రెడ్డి, పీఆర్‌టీయూ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు యాదగిరి జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుసుమ పేర్కొన్నారు. మంగళవారం ఊట్కూర్ మండల కేంద్రంలో లక్ష్మారెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను నిరంతరం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం లక్ష్మారెడ్డి కృషి చేశారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల అభివృద్ధితో పాటు ఉపాధ్యాయుల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలోనే ఉపాధ్యాయ సంఘం ముందుకు సాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు కోరం గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, గౌరవాధ్యక్షుడు ఫజల్, జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.