పిల్లల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం…

పిల్లల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం…

ఎన్టీఆర్ జిల్లాలో 50 సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంపుల నిర్వహణ
పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న 50 సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంపులకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

మే 1 నుంచి 31 వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 27 క్రీడా విభాగాల్లో ఈ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. జిల్లాలోని యువత, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని క్యాంపుల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు, డీఈవో ఎల్.చంద్రకళ, జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply