ఐపీఎల్ బెట్టింగ్‌పై మరో దాడి..

ఐపీఎల్ బెట్టింగ్‌పై మరో దాడి..

మరో ముగ్గురు అరెస్ట్..

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఐపీఎల్ మ్యాచ్‌లను ఆధారంగా చేసుకుని నిర్వహిస్తున్న ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు 1 టౌన్ పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

జిల్లాలో బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 13వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఎం. మహేశ్వరకు అందిన సమాచారంతో దాడి నిర్వహించారు.

చిత్తూరు తిరుపతి మెయిన్ రోడ్డులో కట్టమంచి చెరువు క్రింద గల ఖాళీ ప్రదేశంలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడ ఉన్న నిందితులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా ఐదుగురిని పట్టుకున్నారు.

వారిని అదుపులోకి తీసుకుని 318(2), 61(2) Bఎన్‌ఎస్ సెక్షన్లు, ఏపీ గేమింగ్ యాక్ట్ 3, 4, 7, 15 సెక్షన్లు, ఐటీ యాక్ట్ 66 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, నిందితులు ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఒప్పుకున్నారని తెలిపారు.

అరెస్ట్ అయిన వారిలో శేఖర్ రెడ్డి (34), సి. శశిధర్ (31), సత్య సాయినాథ్ (36) ఉన్నారు. వీరంతా కట్టమంచి ప్రాంతానికి చెందిన వారే. ఇక కేసులో వినోద్, ఐశ్వర్య, ముని పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Leave a Reply