ఆంధ్రప్రభ కథనానికి జిల్లా విద్యాశాఖ స్పందన.
పాయకాపురం, ఆంధ్రప్రభ : ఈనెల7వ తేదీన శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య హై స్కూల్ పాఠశాలలో మంచినీళ్ళు అడిగిన విద్యార్ధులపై పి.ఈ. టి. దాష్టికం అనే ఆంద్ర ప్రభ శీర్షికను సదరు పాఠశాల గురించి వచ్చిన ప్రతికూల వార్తల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించారు.సదరు అధికారి ఈనెల6వ తేదీన పాఠశాలను సందర్శించి, డిప్యూటీ విద్యాశాఖ అధికారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సమక్షంలో ప్రాథమిక విచారణ నిర్వహించారు.

పాఠశాలలో పనిచేస్తున్న శారీరక విద్యా ఉపాధ్యాయుడు డి. రవీంద్రనాథ్ రెడ్డిని పరిపాలనా కారణాల దృష్ట్యా ఆ పాఠశాల నుండి మరో పాఠశాలకు బదిలీ చేయడం జరిగినట్లు ప్రకటనలో తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, సదరు ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ చేయబడ్డాయి. 1991 ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం వారిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ కోరడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరుగుతోందని, విచారణా ఫలితాల ఆధారంగా బాధ్యులైన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ అధికారి పేర్కొన్నారు.
