30 ఏళ్ల విద్యుత్ స్తంభాల సమస్యకు పరిష్కారం
ప్రభుత్వ విప్ వేముల వీరేశం, దశమి ల్యాబ్‌కు కృతజ్ఞతలు తెలిపిన కాటం వెంకటేశం
చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధిలో భాగంగా దశమి ల్యాబ్ సహకారంతో, ప్రభుత్వ విప్ వేముల వీరేశం చొరవతో పెద్దకాపర్తి గ్రామంలో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న 11 కేవీ విద్యుత్ స్తంభాల సమస్య పరిష్కారం కావడంతో దశమి ల్యాబ్ ప్రతినిధులకు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం కృతజ్ఞతలు తెలిపారు.
చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామపంచాయతీలో గ్రామ మధ్యలో 11 కేవీ విద్యుత్ లైన్ ఉండటంతో గత 30 ఏళ్లుగా వర్షాకాలంలో షార్ట్‌సర్క్యూట్‌లు, ప్రమాదాలు జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యను నకిరేకల్ ప్రభుత్వ విప్ వేముల వీరేశం దృష్టికి తీసుకెళ్లగా, ఆయన దశమి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
దశమి ల్యాబ్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల కింద రూ.8 లక్షల వ్యయంతో విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులు చేపట్టేందుకు ముందుకు రావడంతో గ్రామ ప్రజల దీర్ఘకాల సమస్యకు పరిష్కారం లభించిందని కాటం వెంకటేశం తెలిపారు.
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున, గ్రామపంచాయతీ పాలకవర్గం తరఫున ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు, దశమి ల్యాబ్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, జల ప్రశాంత్, తెలుసూరి నరసింహ, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, కంపెనీ ప్రతినిధులు సురేష్, శ్రీకాకుళం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
