తక్కువ నీటితో అధిక లాభాలు వచ్చే పంటలు సాగు చేయాలి

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానాలు మార్చుకోవాలని సూచన

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నందున రైతులు తక్కువ నీటితో అధిక దిగుబడి, అధిక లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలని ఊట్కూర్ సింగిల్ విండో అధ్యక్షులు బాల్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సి. సూర్యప్రకాశ్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్‌రెడ్డి సూచించారు.

సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు మేళా నిర్వహించి విత్తనాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు సంప్రదాయ పంటలతో పాటు తక్కువ నీటి అవసరమయ్యే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల పంటలను సాగు చేయడం ద్వారా ఖర్చు తగ్గించుకుని మంచి ఆదాయం పొందవచ్చని తెలిపారు.

పంటల ఎంపికలో శాస్త్రీయ విధానాలను అనుసరించాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. రైతులు నేల పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం చేపట్టాలని, ధృవీకరించిన విత్తనాలనే ఉపయోగించాలని సూచించారు.

డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను విస్తృతంగా వినియోగించడం ద్వారా నీటిని ఆదా చేసుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి ఆదాయాన్ని పెంచుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు అవసరమని, శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబిస్తే నష్టాలను తగ్గించుకుని మంచి లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో స్వరూపరాణి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొక్కులింగం తదితరులు పాల్గొన్నారు.