ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేత

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ హాజరై విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేశారు. పరకాల పట్టణంలోని దళితవాడ ప్రాథమిక పాఠశాల, దళితవాడ న్యూ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి బొచ్చు సజీవన్ నోట్‌బుక్స్‌ను విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాటం చేస్తుందని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్, ప్రభుత్వ కళాశాల అధ్యక్షుడు దోమ్మటి విశ్వంత్, కమలాకర్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.