యోగాంధ్రకు గుంటూరు సన్నద్ధం..

యోగాంధ్రకు గుంటూరు సన్నద్ధం..

జిల్లావ్యాప్తంగా యోగా మహోత్సవానికి ఏర్పాట్లు

గుంటూరు, ఆంధ్రప్రభ: గుంటూరు జిల్లాలో ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రత్యేక యోగ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. విజయలక్ష్మి, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి అఫ్రోజ్ పాల్గొని పలువురికి స్ఫూర్తినిచ్చేలా యోగాసనాలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా కె. విజయలక్ష్మి మాట్లాడుతూ, యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, సంపూర్ణ ఆరోగ్యానికి మార్గమని పేర్కొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ దానిని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.

ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో యోగ శిక్షకులు, ఔత్సాహికులు, యువత భాగస్వామ్యంతో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి ప్రారంభమయ్యే యోగా పోటీలు జిల్లా, రాష్ట్ర స్థాయిల వరకు కొనసాగుతాయని, విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.

అలాగే జూన్ 21న మంగళగిరి వెస్ట్రన్ బైపాస్ వద్ద నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యక్రమంలో N. Chandrababu Naidu ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు వెల్లడించారు.

యువత, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని గుంటూరు జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా నిలపాలని అధికారులు పిలుపునిచ్చారు.

Leave a Reply