రైల్వే భద్రతపై స్పెషల్ డ్రైవ్..

రైల్వే భద్రతపై స్పెషల్ డ్రైవ్..

ధూమపానం, మండే పదార్థాలపై ఆర్పీఎఫ్ ఉక్కుపాదం
నాలుగు రోజుల్లో 37 కేసులు నమోదు
ప్రత్యేక డ్రైవ్‌లో మరో 8 మంది పట్టివేత
ప్రయాణికుల భద్రతే లక్ష్యమంటున్న ఆర్పీఎఫ్

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రయాణికుల భద్రతతో పాటు రైల్వే ఆస్తుల పరిరక్షణకు దక్షిణ తీర రైల్వే విజయవాడ డివిజన్ రైల్వే రక్షక దళం కఠిన చర్యలు చేపడుతోంది. రైళ్లలో ధూమపానం చేయడం, మండే పదార్థాలను తీసుకెళ్లడం వంటి అగ్నిప్రమాదాలకు దారితీసే చర్యలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది. ప్రస్తుత నెలలో జూన్ 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో రైల్వే చట్టంలోని సెక్షన్ 167 కింద మొత్తం 37 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 24 కేసులు రైళ్లలో గుర్తించగా, మరో 13 కేసులు రైల్వే స్టేషన్లు, ప్రాంగణాల్లో వెలుగుచూశాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అదే క్రమంలో జూన్ 5న ప్రత్యేక అగ్నిభద్రతా డ్రైవ్ నిర్వహించి మరో 8 మందిని పట్టుకున్నారు.

వీరిలో ఐదుగురు శేషాద్రి, సింహపురి,, జనశతాబ్ది, గురుదేవ్ వంటి రైళ్లలో ధూమపానం లేదా మండే పదార్థాల రవాణా చేస్తూ గుర్తించబడ్డారు. మిగిలిన ముగ్గురు స్టేషన్ ప్లాట్‌ఫారాలు, సర్క్యులేటింగ్ ఏరియాల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు వెల్లడించారు. రైళ్లలో అగ్నిప్రమాదాల ప్రమాదాన్ని పూర్తిగా నివారించడమే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశమని ఆర్పీఎఫ్ అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు భద్రతా నిబంధనలు పాటిస్తూ సహకరించాలని, ధూమపానం లేదా మండే పదార్థాల వినియోగం గమనించిన వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ డివిజన్ ఆర్పీఎఫ్ భవిష్యత్తులోనూ ఇలాంటి తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నట్లు స్పష్టం చేసింది.

Leave a Reply