AP | అరగంటలో లోడ్​ మాయం..

AP | అరగంటలో లోడ్​ మాయం..

చిత్తూరు జిల్లాలో సంచలనం


AP | చిత్తూరు, ఆంధ్ర‌ప్ర‌భ : చిత్తూరు డిపో నుండి కార్వేటినగరం వైపు మద్యం లోడ్‌తో వెళ్తుండగా, బసిరెడ్డిపల్లి సమీపంలో లారీ టైర్ ఒక్కసారిగా పగిలిపోవడంతో (పంక్చర్ అవ్వడంతో) వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.

చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం బసిరెడ్డిపల్లి వద్ద సుమారు పది లక్షల రూపాయల విలువైన మద్యం లోడ్‌తో వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ అయి బోల్తా పడింది ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. లారీ బోల్తా పడిన నిమిషాల్లోనే స్థానికులు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లడంతో సరుకంతా ఖాళీ అయింది.

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని శ్రీరంగరాజపురం మండలంలో శుక్రవారం మద్యం సరఫరా చేస్తున్న టెంపో బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. ప్రమాదంలో సుమారు రూ.12 నుంచి రూ.13 లక్షల విలువైన మద్యం రోడ్డుపాలవగా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వాహనదారులు పెద్దఎత్తున మద్యం బాటిళ్లను తీసుకెళ్లడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పూతలపట్టు నుంచి కొల్లాగుంటలోని మద్యం దుకాణానికి మద్యం కేసులను తరలిస్తున్న టెంపో చిత్తూరు–పుత్తూరు ప్రధాన రహదారిపై బసివి సిరెడ్డిపల్లి కాలనీ సమీపానికి చేరుకున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది.

టెంపోలో సుమారు 251 కేసుల మద్యం ఉండగా, ప్రమాదం కారణంగా వాహనంలోని మద్యం పెట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. టెంపోలో నుంచి బయటపడిన మద్యం బాటిళ్లను ఎవరికి తోచినంతగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కొందరు పెట్టెలతోనే మద్యం సీసాలను తరలించగా, మరికొందరు చేతికి చిక్కిన బాటిళ్లను తీసుకుని వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న ఎస్.ఆర్.పురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుమన్ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పాటు, గుంపులను చెదరగొట్టి మిగిలిన మద్యం నిల్వలను భద్రపరిచారు. ప్రమాదం కారణంగా కొంతసేపు చిత్తూరు–పుత్తూరు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. వాహనం వేగంగా ప్రయాణించడం, రహదారి మలుపు లేదా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. టెంపో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. మద్యం సరుకుకు జరిగిన నష్టం, ప్రజలు తీసుకెళ్లిన మద్యం పరిమాణం, ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply