పనులు ఆలస్యమైతే చర్యలు తప్పవు

పనులు ఆలస్యమైతే చర్యలు తప్పవు

జలధార–జలహారతి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార–జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులన్నింటినీ వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయని అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జలధార ప్రాజెక్టుల పురోగతిపై డ్వామా, ఇరిగేషన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా పనుల ప్రగతిని ఆయన పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా జలధార కార్యక్రమం కింద రూ.24,851.78 లక్షల అంచనా వ్యయంతో మొత్తం 7,143 పనులను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 5,765 పనులకు పరిపాలనా అనుమతులు లభించాయని చెప్పారు.

మంజూరైన పనుల్లో 4,247 పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, వాటిలో 3,428 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని వివరించారు. అలాగే 819 పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా 1,518 పనులు ప్రారంభం కావాల్సి ఉందని, వాటిని ఆలస్యం చేయకుండా తక్షణమే క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. జిల్లాలో మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో 799 పనులను గుర్తించి, వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మండలాల వారీగా ప్రగతిని పరిశీలించిన కలెక్టర్, లావేరు, జలుమూరు మండలాల్లో ఎక్కువ పనులు జరుగుతున్నాయని తెలిపారు. మిగిలిన మండలాలు కూడా నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా పనుల్లో వేగం పెంచాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో కాల్వలు, చెరువుల పూడికతీత పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నీటి బొట్టును సంరక్షించుకునేలా నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.

పనుల గుర్తింపు, పురోగతి, పూర్తయిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫొటోలతో సహా అప్‌లోడ్ చేయాలని డ్వామా పీడీని కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని మరోసారి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో డ్వామా పీడీ లవరాజు, ఇరిగేషన్ ఎస్ఈ పొన్నాడ సుధాకరరావు, జడ్పీ సీఈఓ వెంకటరమణ, ఈఈలు, ఎంపీడీఓలు, ఏపీఓలు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.