ఘనంగా ప్రపంచ పకృతి పరిరక్షణ దినోత్సవం..

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఉరవకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వజ్రకరూరు మండలంలోని కదమల కుంట గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎన్. నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన అత్త శ్రీమతి ఎన్. వసుంధరాదేవి స్మారకార్థం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రూ.10,000 విలువైన 20 కుర్చీలను విరాళంగా అందజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశేష సేవలు అందిస్తోందని కొనియాడారు.

కళాశాలలో నిర్వహిస్తున్న విద్యా, సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ, విద్యార్థులు ప్రదర్శించిన క్రమశిక్షణ, ప్రతిభ, ఉత్సాహాన్ని అభినందించారు. ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కల పెంపకం, నీటి సంరక్షణ వంటి కార్యక్రమాలలో యువత ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. శైలజా రాణి మాట్లాడుతూ, గ్రామీణ కళాశాల అభివృద్ధికి డా. నారాయణస్వామి అందించిన సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చేసిన విరాళం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

సీనియర్ అధ్యాపకులు డా. టి. ఎన్. మస్తానప్ప మాట్లాడుతూ వసుంధరాదేవి స్మారకార్థం కళాశాలకు విరాళం అందించడం ద్వారా డా. నారాయణస్వామి చూపిన కృతజ్ఞతా భావం ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాధికారులు సుధాకర్ మరియు విష్ణుప్రియ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళాశాల ఆవరణలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ వెంకట రాముడు, వెంకటేశులు, సుజాత, రామాంజినేయులు, అనిల్, వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.