హైడ్రా కొనసాగుతుంది.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం
- కేంద్రం పెత్తనంతోనే పరీక్షల్లో అవకతవకలు
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ విమర్శలకు కౌంటర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత కీలక సంస్కరణల్లో హైడ్రా ఒకటని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారులను ఎక్కడ నియమించాలన్నది ప్రభుత్వ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు సంబంధించిన అంశంపై వచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని తెలిపారు. హైడ్రాపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించిన ముఖ్యమంత్రి, కొందరు డబ్బులు వెచ్చించి మరీ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలను ఇంకా పూర్తిగా పరిశీలించలేదని, అయినప్పటికీ హైడ్రా కార్యకలాపాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇక మరోవైపు రాష్ట్ర విద్యా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ జోక్యం పెరగడం వల్లే పరీక్షల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర యూనివర్సిటీలు, పరీక్షల నిర్వహణపై కేంద్రం పెత్తనం చెలాయించడం తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై బీజేపీ విమర్శలకు స్పందించిన రేవంత్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని అన్నారు. ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ముందుగా అక్కడ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇప్పించాలని కోరాలని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏపీలో సమస్యను పరిష్కరించిన తర్వాతే తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించాలని వ్యాఖ్యానించారు.
