గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

సర్పంచుల వినతులపై సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ కిరణ్ కుమార్

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలంలోని వివిధ గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ను కలిసి సర్పంచులు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న రెవెన్యూ, భూ సమస్యలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, పట్టాదారు పాస్‌బుక్‌లకు సంబంధించిన అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న పలు పరిపాలనా సమస్యలను తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సర్పంచులు కోరారు.

విన్నపాలను శ్రద్ధగా ఆలకించిన తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సర్పంచులు ప్రస్తావించిన ప్రతి సమస్యను పరిశీలించి, నిబంధనల మేరకు దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రెవెన్యూ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.

తహసీల్దార్‌ను మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆరిగేల జనార్దన్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు రమేష్, తిరుపతి, రాజారెడ్డి, దుమల రాజు, కార్తీక్, పిండి అశోక్, వసంధర్ నాయక్, గణేష్, సేవాలాల్ కలిసి తమ గ్రామాల సమస్యలను వివరించారు.