కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

  • శ్రమజీవుల హక్కులను కాలరాస్తున్నారు
  • సీపీఐ (ఎంఎల్) రెడ్ స్టార్ కేంద్ర కమిటీ సభ్యుడు మహ్మద్ భాషా

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ శ్రమజీవుల హక్కులను కాలరాస్తున్నాయని సీపీఐ (ఎంఎల్) రెడ్ స్టార్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మహ్మద్ భాషా విమర్శించారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన సీపీఐ (ఎంఎల్) రెడ్ స్టార్ పార్టీ మంచిర్యాల జిల్లా 3వ మహాసభ విజయవంతంగా జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. దేశ సంపద కొద్దిమంది పెట్టుబడిదారుల లాభాల కేంద్రం కాదని, అది శ్రమజీవుల సొత్తని స్పష్టం చేశారు. ఒకవైపు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రైవేటీకరణతో రైతులు, కార్మికులు సంక్షోభంలో కూరుకుపోతుంటే, మరోవైపు పాలకులు కార్పొరేట్ శక్తులకు వేల కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారని మండిపడ్డారు.

ప్రజల తరఫున ప్రశ్నించే ప్రగతిశీల శక్తులపై నిర్బంధాలు ఆపాలని, ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా పీడిత ప్రజలందరూ ఐక్యమై పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మండల కుమారస్వామి మహాసభను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఉంటున్న పేదలకు తక్షణమే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని మహాసభ డిమాండ్ చేసింది. అలాగే బెల్లంపల్లి ఏరియాలో దళితులపై అటవీ శాఖ అధికారులు సాగిస్తున్న దౌర్జన్యాలు, వేధింపులు మానుకోవాలని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను తక్షణమే క్రమబద్ధీకరించాలని తీర్మానించారు. యువతకు ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వ పరిశ్రమలను స్థాపించాలని, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సభలో ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించారు.

రెడ్‌స్టార్ జిల్లా కార్యదర్శిగా గోగర్ల శంకర్ ఏకగ్రీవ ఎన్నిక
9 మందితో నూతన జిల్లా కమిటీ ఎంపిక..
మహాసభలో మంచిర్యాల జిల్లా కమిటీ నివేదికను గోగర్ల శంకర్ సమర్పించగా, సభ్యులు చర్చించి ఆమోదించారు. ఈ సందర్భంగా 9 మంది సభ్యులతో కూడిన నూతన జిల్లా కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సీపీఐ (ఎంఎల్) రెడ్ స్టార్ మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా గోగర్ల శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికవగా, కమిటీ సభ్యులుగా చొప్పదండి తిరుపతి, కలువల సంపత్, గుడెసెల లక్ష్మి, కలవల ప్రకాష్, లింగంపల్లి రాజు, బుజ్జి కృష్ణ, దూడ లక్ష్మి, తాటం భీమయ్య ఎన్నికయ్యారు.