TG | కాంగ్రెస్ తాత జేజమ్మలు దిగివచ్చినా కేసీఆర్ ను మరిపించలేరు : కేటీఆర్
రేవంత్ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ కు తిట్ల పురాణం తప్ప మరేమీ రాదని విమర్శించారు. కానీ మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము ఆయనలా మాట్లాడం అని అన్నారు. ‘‘కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు.. కట్టె లేకుండా నిలబడు అంటున్నడు.
కేసీఆర్ నిలబడడం కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దేశం ముందు సమున్నంగా నిలబెట్టిండు.. కేసీఆర్ కట్టె లేకుండా నిలబడుతడు.. రేవంత్ రెడ్డి దమ్ముంటే కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా ముందుకు తీసుకెళ్లాం…
‘‘కేసీఆర్ చంటి పిల్లను సాదుకున్నట్లు పదేళ్ల పాటు తెలంగాణను సాదుకున్నారు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాం. పదేండ్ల పాటు అద్భుతంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా ముందుకు తీసుకెళ్లాం అని అన్నారు. తండాలను గ్రామపంచాయతీలు చేశాం. కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. పరిపాలన ఫలాలు మీ ముంగిటకు రావాలని వికేంద్రీకరణ చేసుకున్నాం’’ అని కేటీఆర్ తెలిపారు.
ఆఖరికి సఫాయి సిబ్బందికి కూడా పైసలు పడట్లేదు
“రైతుబంధు లాంటి కార్యక్రమం దేశంలో ఎవరూ అమలు చయలేదు. ఓట్ల కోసం మేనిఫెస్టోలో పెట్టకపోయినప్పటికీ.. రూ.73 వేల కోట్లు రైతు బంధురూపంలో, రూ.28 వేల కోట్లు రుణమాఫీ రెండు దఫాలుగా చేశాం. నాట్లేసే సమయంలో రైతుబంధు నిధులు వేసేటోళ్లం.
అప్పుడు టింగ్ టింగ్ మని చప్పుడు వచ్చేది.. ఇప్పుడు టకీటకీ అని వస్తాయని రేవంత్ రెడ్డి అంటున్నడు. కానీ పైసలు ఎవరికీ పడలేదు. తులం బంగారం, రూ.2500, స్కూటీలు, స్కాలర్ షిప్స్, రైతుబంధు, ఆఖరికి సఫాయి సిబ్బందికి పైసలు పడట్లేదు”అని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్‌కు, రేవంత్‌కు పోలికనే లేదు..
‘‘కేసీఆర్ కొడితే ఎట్ల ఉంటదో.. నీ పాత గురువు, ఇప్పుడు నీ గురువు తల్లిని అడుగు. కేసీఆర్‌కు, రేవంత్‌కు పోలికనే లేదు. కేసీఆర్ అంటే హిస్టరీ.. రేవంత్ అంటే లాటరీ.. టికెట్ కొనకుండా లాటరీ గెలిచినోడు. తప్పిదారి అడ్డిమారి గుడ్డి దెబ్బలో సీఎం అయితే ఆగతలేడు. నీ కంటే ముందు చాలా మంది సీఎంలుగా చేశారు.
కేసీఆర్ పేరును నీవు కాదు కదా.. కాంగ్రెస్ తాత జేజమ్మలు దిగివచ్చినా మరిపించలేరు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం ఈ రాష్ట్రం ఎవరు తెచ్చారంటే కేసీఆర్ అంటరు. తిట్ల పురాణం బంద్ చేయ్.. హానీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. కొత్తగా రేవంత్ రెడ్డి సీఎం అయిండు కాబట్టి ఏమన్న చేస్తడోమే అనుకున్నాం.. కానీ ఏం చేయలేదు.
ఇక సినిమా ఉన్నది ముంగిట. కేసీఆర్ అసెంబ్లీకి రా అంటున్నడు రేవంత్ రెడ్డి. నీకు దమ్ముంటే లగచర్లకు రా.. నీ సంగతి ఏంటో చెప్తరు. సెక్యూరిటీ లేకుండా రా.. నీవు వస్తవో రావో తెలియదు కానీ త్వరలోనే పక్కా కొడంగల్‌కు దండయాత్రలా వస్తాం. భాజప్తా పోయి కొడంగల్‌లో మీటింగ్ పెడుతాం”అని కేటీఆర్ స్పష్టం చేశారు.