ఆకట్టుకున్న సిద్ధార్థ విద్యార్థుల స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీ

తొర్రూరు టౌన్ (ఆంధ్రప్రభ): తొర్రూరు డివిజన్ కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ సంఘాలు, కార్యాలయాలు, పాఠశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మచ్చా సురేష్, కిరాణా మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షుడు దొడ్డ రఘు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.

పట్టణంలోని సిద్ధార్థ హైస్కూల్ విద్యార్థులు నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తూ దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర్య ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన వేడుకల్లో తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంబాబు, చైతన్య కళాశాల అధ్యక్షుడు మన్నూరు ఉమా, వ్యాపారవేత్త నాగేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.