మువ్వన్నెల రెపరెపలు.. శాయంపేటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హనుమకొండ/శాయంపేట (ఆంధ్రప్రభ): శాయంపేట మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ పతాకాలను ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో సీఐ సుధాకర్ రెడ్డి, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఫణిచంద్ర, పీహెచ్‌సీలో వైద్యాధికారి సాయి కృష్ణ, రైతు వేదికలో ఏఓ ప్రియదర్శిని, మండల సమాఖ్య కార్యాలయంలో అధ్యక్షురాలు సుమలత జాతీయ జెండాలను ఆవిష్కరించారు. గ్రామాల్లో సర్పంచులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, కుల సంఘాలు, యువజన సంఘాల అధ్యక్షులు జాతీయ పతాకాలను ఎగురవేశారు.
ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. జాతీయ నాయకుల వేషధారణలో విద్యార్థులు అలరించారు. నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
