గుడివాడలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…

జాతీయ పతాకాన్ని ఎగరవేసి పతాక వందనం చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము


గుడివాడ – ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడమే నిజమైన స్వాతంత్ర్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు.

గుడివాడ పట్టణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పలు కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి పతాక వందనం చేశారు. జాతీయ గీతాలాపనలో పాల్గొని ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు.

ముందుగా ఏలూరు రోడ్డులోని ఫాదర్ బియాంకి ఆర్‌సీఎం పాఠశాలలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణతో మార్చ్‌ఫాస్ట్ నిర్వహించి ఎమ్మెల్యేకు గౌరవ వందనం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి నినాదాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.

అనంతరం గుడివాడ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో కమిషనర్ సింహాద్రి మనోహర్‌తో కలిసి ఎమ్మెల్యే రాము జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందికి ఎమ్మెల్యే రాము ప్రశంసా పత్రాలను అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన పోరాటాలు, చేసిన ప్రాణత్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని అన్నారు.

బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా అనేక మంది జైళ్లకు వెళ్లి, చిత్రహింసలకు గురైనా వెనకడుగు వేయకుండా పోరాటం కొనసాగించారని, వారి త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని గుర్తు చేశారు. మహనీయుల త్యాగ ఫలితంగా మనకు లభించిన స్వేచ్ఛను వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన “దేశం మనకేమిచ్చిందో కాదు… దేశానికి మనమేమి ఇచ్చాము” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. దేశం మనకు ఏమీ ఇవ్వలేదని ఆ మాటల అర్థం కాదని, దేశం ప్రతి ఒక్కరికీ లెక్కలేనన్ని అవకాశాలు, హక్కులు, స్వేచ్ఛను అందించిందని తెలిపారు. దేశం కోసం మనం చేసే ప్రతి మంచి పని మనకే కాకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని అన్నారు.

దేశ భవిష్యత్తును మరింత బలంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. దేశం అనేది కేవలం సరిహద్దులతో కూడిన విస్తారమైన భూభాగం మాత్రమే కాదని, మన సమాజం, మన ఊరు, మన వీధి, చివరకు మన ఇల్లు కూడా దేశంలో భాగమేనని అన్నారు. “మన ఇల్లు – మన వీధి” అనే భావనతో ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో బాధ్యతగా పనిచేస్తే అదే నిజమైన దేశసేవ అవుతుందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.

మన చట్టాలను మనమే రూపొందించుకోవడం, మనల్ని మనమే పాలించుకోవడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడమే స్వాతంత్ర్యానికి నిజమైన అర్థమని అన్నారు. దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు.

ఆర్.సి.యం పాఠశాలలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో హెచ్ఎంలు జయమ్మ,మేరీ మాక్సినీ, సిస్టర్ సిసిలి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు… మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.