మనిషి జీవితంలో మంచి ఉన్నత స్థితికి చేరుకున్న ఆ ఉన్నతికి చెడు కలిగించే అంశాలు రెండు ఒకటి అహంకారం రెండు చెడు వ్యసనం. అహంకారమనేది మనిషి పతనానికి దారి తీస్తుంది నా దగ్గర విద్య ఉంది నేను గొప్ప ప్రతిభావంతుడను మిగిలిన వారందరూ నా ముందు ఎందుకు పనికిరారనే అహంకార ధోరణితో అందరినీ చిన్నచూపు చూడడంతో అందరూ అతన్ని ‘ప్రతిభవంతుడే కానీ అహంకారి ఇతరులను కనీసం మనిషి లాగా కూడా చూడడు’ అని ఎవరూ అతనిని పట్టించుకోరు! మన ప్రతిభ నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలే గాని మన ప్రతిభ వల్ల లేని పోనీ గొప్పలకు పోయి అహంకారాన్ని తెచ్చిపెట్టుకొని అందరినీ దూరం చేసుకోవడం అంత మంచిది కాదు అటువంటి వారి ప్రతిభ అడవి కాచిన వెన్నెలే! కనుక ప్రతిభ కలిగి ఉండి అహంకారాన్ని ఆమడ దూరం వదిలేసి అందరిని గౌరవించే సహృదయత కలిగి ఉండడం అనేది ఉత్తముల లక్షణం. విద్యతో పాటు వినయం ఉంటేనే ఆ విద్య మరింత శోభిల్లుతుంది.
రెండవ అంశం చెడు వ్యసనం ఏదో ఒక చెడు వ్యసనం కలిగి ఉన్న వ్యక్తి అతనిలో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ ఆ చెడు వ్యసనం (మద్యపానం, ధూమపానం వంటివి) అతని ప్రతిభ ను మసకబారుస్తుంది! అందరూ అతనిని దూరం పెడతారు. ఎంత ప్రతిభ ఉన్నా వ్యసనపరుడు అనే ముద్ర పడినచో అతనిని ఎవరూ పట్టించుకోరు, సమాజంలో గౌరవం కోల్పోతాడు కనుక ఏ వ్యక్తి అయినా తను ఉన్నత స్థితిలో ఉండాలి అనుకుంటే అతనికి ఉండకూడని దుర్గుణాలు ఒకటి అహంకారం రెండు చెడు వ్యసనం. వీటిని ఎవరైతే తమ దరిదాపులకు రాకుండా చూసుకుంటారో వారు చక్కని కీర్తి ప్రతిష్టలు పొందుతారని మన ధర్మస్థ గ్రంథాలు చెబుతున్నాయి.
- ఏడుకొండలు కళ్ళేపల్లి