WAR | మామిడి సీజన్‌పై గట్టి దెబ్బ..

WAR | మామిడి సీజన్‌పై గట్టి దెబ్బ..
WAR | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో గల్ఫ్ దేశాలకు వెళ్తున్న ప్రాసెస్ చేసిన మామిడి రవాణా మధ్యలోనే నిలిచిపోయింది. అనేక పోర్టులు పూర్తి సామర్థ్యంతో పని చేయకపోవడంతో షిప్‌మెంట్లు నిలిచిపోతున్నాయి. ఫలితంగా, 90 శాతం కంటే ఎక్కువ పల్ప్ నిల్వలు గోదాములు, పోర్టు గిడ్డంగుల్లోనే నిలిచిపోయి, చిత్తూరు జిల్లాలోని పరిశ్రమల ఎగుమతులు పూర్తిగా స్థంభించిపోయాయి.
ప్రస్తుత మామిడి సీజన్ పై కూడా ఆశలు కనిపించడం లేదు. విదేశీ దిగుమతిదారుల నుంచి ఇప్పటి వరకు చెల్లింపులు అందకపోవడంతో, ఈ ఏడాది రైతుల నుంచి మామిడి పండ్ల కొనుగోలు చేయలేకపోతున్నామని ప్రాసెసింగ్ యూనిట్ యజమానులు చెబుతున్నారు. ప్రపంచ స్థాయిలో ప్రాసెస్ చేసిన మామిడి ఉత్పత్తులకు హబ్‌గా పేరుగాంచిన చిత్తూరు జిల్లా పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
పరిశ్రమ వర్గాల ప్రకారం, ప్రస్తుతం 3 లక్షల టన్నులకు పైగా మామిడి గోదాములు, పోర్టు గిడ్డంగుల్లో నిలిచిపోయింది. మరోవైపు, గల్ఫ్ దేశాలకు పల్ప్ రవాణా చేయాలంటే ఒక్కో కంటైనర్‌కు 2,000 డాలర్ల ‘వార్ రిస్క్ సర్‌చార్జ్’ చెల్లించాల్సి ఉంటుందని కంటైనర్ కంపెనీలు యూనిట్ యజమానులకు తెలిపాయి. అదనంగా, ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తమ ఛార్జీలను సాధారణ రేట్లతో పోలిస్తే.. మూడు నుంచి నాలుగు రెట్లు పెంచాయి. దీంతో ఎగుమతుల లాభాలు తీవ్రంగా పడిపోయాయి. 7.4 టన్నుల పల్ప్ ఉన్న ఒక్కో కంటైనర్ పై యూనిట్లకు ఇప్పుడు అత్యల్ప లాభాలే మిగులుతున్నాయి. గోదాముల్లో ఉన్న నిల్వలను క్లియర్ చేసేందుకు చాలా యూనిట్లు తక్కువ ధరలకు ఎగుమతులు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
సాధారణంగా సీజన్‌లో రైతుల నుంచి 6 నుంచి 7 లక్షల టన్నుల మామిడిని సేకరించి, సుమారు 3 నుంచి 4 లక్షల టన్నుల పల్ప్ తయారు చేస్తారు. ఇందులో ప్రధానంగా తొటాపురి రకం మామిడి ఉంటుంది. మొత్తం పల్ప్‌లో దాదాపు 70 శాతం గల్ఫ్, యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థ మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది.
