మంగినపూడి తీరంలో విషాదం.. మత్స్యకారుడు గల్లంతు
మచిలీపట్నం (ఆంధ్రప్రభ): కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ సమీపంలో శనివారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో వేటకు వెళ్తున్న వైఎస్సార్ ఫిషర్మెన్ కాలనీకి చెందిన పల్లెటి రాజు (25) అనే యువ మత్స్యకారుడు ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయి గల్లంతయ్యాడు. తెల్లవారుజామున తోటి మత్స్యకారులతో కలిసి బోటులో సముద్రంలోకి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
సముద్రంలో వాతావరణం అకస్మాత్తుగా మారడంతో అలల తీవ్రత పెరిగిందని తోటి మత్స్యకారులు తెలిపారు. రాకాసి అలల ఉద్ధృతికి బోటు తీవ్రంగా ఊగిపోవడంతో రాజు అదుపుతప్పి సముద్రంలో పడిపోయినట్లు పేర్కొన్నారు. గల్లంతైన రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
