“వాయిస్ ఆఫ్ సిటిజన్స్” కార్యక్రమానికి శ్రీకారం..

“వాయిస్ ఆఫ్ సిటిజన్స్” కార్యక్రమానికి శ్రీకారం..

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : కందికుంట వెంకటప్రసాద్ వినూత్న ఆలోచనతో కదిరి నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యేలా “వాయిస్ ఆఫ్ సిటిజన్స్” కార్యక్రమాన్ని ప్రారంభించారు. “మీ సమస్య… మా బాధ్యత – మీ సమస్యకు పరిష్కారం మా కర్తవ్యం” అనే నినాదంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని కదిరిలో అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ పరిపాలనలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతోనే “వాయిస్ ఆఫ్ సిటిజన్స్” కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. సాధారణ పౌరుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం, అధికారులను కలవడం లేదా ప్రజాప్రతినిధులను సంప్రదించడం వంటి విషయాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగలగడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు. “ఒక సామాన్యుడు తన సమస్యను చెప్పుకునేందుకు సులభమైన మార్గం ఉండాలి.

ప్రజలకు ఎమ్మెల్యే మా సమస్యకు దారి చూపిస్తాడనే నమ్మకం కల్పించడమే మా లక్ష్యం” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పేద ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి వేగంగా పరిష్కారం చూపించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అభ్యర్థనలు, సమస్యలను స్వీకరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. “వాయిస్ ఆఫ్ సిటిజన్స్” కార్యక్రమం అమలులో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే అంగీకరించారు. అయితే సమస్యలు వచ్చినా వెనక్కి తగ్గకుండా సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసమే తమకు బలమని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ రాజకీయ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన అందుతుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు ఎమ్మెల్యే తీసుకున్న ఈ ప్రత్యేక చొరవ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.