అక్కపాలెంలో విలేజ్ హెల్త్ క్లినిక్‌కు శ్రీకారం

అక్కపాలెంలో విలేజ్ హెల్త్ క్లినిక్‌కు శ్రీకారం

రూ.36 లక్షల వ్యయంతో నూతన భవన నిర్మాణం..
భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కొలికపూడి

తిరువూరు, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. మండల పరిధిలోని అక్కపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

రూ.36 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ హెల్త్ క్లినిక్ ద్వారా స్థానిక ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు మరింత మెరుగ్గా అందనున్నాయి. గ్రామ స్థాయిలోనే నాణ్యమైన వైద్యం, మందులు అందుబాటులోకి వస్తే పేద ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం ముందుకొచ్చే దాతల సేవలు ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు. విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా అందించిన స్థానిక ప్రముఖులు యనమల చిన్న వెంకటరెడ్డి, సెట్టిపల్లి వెంకటనారాయణ రెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు.

సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడాలన్న గురజాడ మాటలను నిజం చేస్తూ, గ్రామంలోని పేద ప్రజల ఆరోగ్య అవసరాల కోసం స్థలాన్ని దానం చేసిన ఈ ఇద్దరు దాతలు అందరికీ ఆదర్శప్రాయులని ఎమ్మెల్యే ప్రశంసించారు.

నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో క్లినిక్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. భూమిపూజ అనంతరం స్థల దాతలను ఎమ్మెల్యే, గ్రామస్తులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, వైద్యాధికారులు, అక్కపాలెం గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply