తోతపూరి రైతులకు ప్రభుత్వం అండ

తోతపూరి రైతులకు ప్రభుత్వం అండ

న్యాయమైన ధర లభించేలా చర్యలు..

నేరుగా రైతుల నుంచే కొనుగోళ్లు చేయాలని ప్రాసెసింగ్ యూనిట్లకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం

అమరావతి, ఆంధ్రప్రభ: తోతపూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తోతపూరి మామిడి ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్‌, కొనుగోలు ఏర్పాట్లపై బుధవారం వర్చువల్‌ విధానంలో సమీక్ష నిర్వహించారు.

విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి సమీక్షలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 78 వేల హెక్టార్లలో తోతపూరి మామిడి సాగు జరుగుతోందని, ఈ పంటపై వేలాది మంది రైతుల జీవనోపాధి ఆధారపడి ఉందన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ ఏడాది కొంత మేర దిగుబడి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని తెలిపారు.

గత సీజన్‌లో కోకాకోలా, పార్లే, పెప్సీ వంటి ప్రముఖ పానీయాల సంస్థలు పెద్ద ఎత్తున మామిడి పల్ప్ కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మేలు జరిగిందని మంత్రి అభినందించారు. ఈ ఏడాది కూడా గత సంవత్సరం మాదిరిగానే కొనుగోలు ఆర్డర్లు ఇవ్వాలని ఆయా సంస్థలను కోరారు. మామిడి పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్లు వ్యాపారుల ద్వారా కాకుండా నేరుగా రైతుల నుంచే పండ్లను కొనుగోలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పూర్తిగా పరిపక్వత చెందిన నాణ్యమైన ప్రతి పండును కొనుగోలు చేస్తామని, చివరి పండు వరకు రైతులకు మార్కెట్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తోతపూరి పండ్ల కొనుగోలు విషయంలో రైతుల్లో ఎలాంటి అపోహలు, ఆందోళనలు లేకుండా అధికారులు, సిబ్బంది విస్తృత ప్రచారం చేపట్టాలని మంత్రి సూచించారు. పండ్ల నాణ్యత మెరుగుదలకు దోహదపడే ఫ్రూట్ కవర్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ఒకేసారి కోతలు చేపట్టడం వల్ల మార్కెట్‌పై ఒత్తిడి పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉందని, అందువల్ల దశలవారీగా కోతలు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా అధికారులకు సూచించారు.

తమిళనాడులోని కృష్ణగిరి మార్కెట్‌లో తక్కువ ధరలు నమోదవుతున్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందని మంత్రి తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం తమిళనాడు అధికారులతో చర్చలు జరిపి, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సమాన ధరల విధానం అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ప్రస్తుత సీజన్ ముగిసే వరకు జిల్లా యంత్రాంగం పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, కొనుగోళ్లలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. తోతపూరి మామిడి రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ కట్టుబాటుతో పనిచేస్తుందని, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన ప్రతి చర్యను చేపడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు.

ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ.. దశలవారీ కోతలు, పరిపక్వ పండ్ల కోతపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం పల్ప్ ఉత్పత్తికే పరిమితం కాకుండా మామిడి ఆధారిత విలువ వృద్ధి ఉత్పత్తుల తయారీపై కూడా దృష్టి సారించాలన్నారు. మామిడి తొక్కలు, గింజల వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఈ అంశాలపై సాంకేతిక అవగాహన కల్పించేందుకు మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ సహకారంతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆరెంజ్ కేటగిరీలో ఉన్న పల్ప్ పరిశ్రమలను గ్రీన్ కేటగిరీలోకి మార్చే అంశాన్ని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిశీలిస్తామని వెల్లడించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 7.80 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి నమోదవుతుందని ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు వివరించారు. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 25 నుంచి 30 శాతం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఇతర మామిడి రకాలతో పోలిస్తే తోతపూరి పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు.

జిల్లాలో ప్రస్తుతం 44 మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, వీటిలో 37 యూనిట్లు ఈ సీజన్‌లో కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. వీటి మొత్తం ప్రాసెసింగ్ సామర్థ్యం సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉందన్నారు. ఇప్పటికే 20 యూనిట్లు కార్యకలాపాలు ప్రారంభించగా, వాటిలో 13 యూనిట్లు అల్ఫాన్సో, 7 యూనిట్లు తోతపూరి మామిడి ప్రాసెసింగ్ చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్‌లో తోతపూరి మామిడి ధర కిలోకు రూ.7 నుంచి రూ.7.50 మధ్య కొనసాగుతోందన్నారు.

తోతపూరి రైతులకు అండగా నిలుస్తామని పల్ప్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. ఈ ఏడాది ముందస్తుగానే కొనుగోలు ప్రణాళికలు రూపొందించామని, గత సంవత్సరం మాదిరిగా ఒకేసారి కొనుగోళ్లు జరగకుండా ఎక్కువ రోజులు కొనుగోలు ప్రక్రియ కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుల నుంచే నేరుగా పండ్లను సేకరించి, పండ్లు వృథా కాకుండా చూస్తామని చెప్పారు.

గత రెండు మూడు సంవత్సరాలుగా మామిడి పల్ప్ పరిశ్రమ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని పరిశ్రమల ప్రతినిధులు పేర్కొన్నారు. మామిడి జ్యూస్‌ల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, తాజా మామిడి పండ్లకు కల్పిస్తున్న ప్రోత్సాహం తరహాలోనే మామిడి పల్ప్‌కు కూడా జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాలని సూచించారు. గత ఏడాది మార్కెట్ డిమాండ్‌ను మించి పల్ప్ ప్రాసెసింగ్ జరగడంతో ప్రస్తుతం భారీ నిల్వలు ఉన్నప్పటికీ, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత మేరకు కొనుగోళ్లు చేపడతామని తెలిపారు.

ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ఉద్యానవన శాఖ డైరెక్టర్‌, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు, ఉద్యానవన శాఖ అధికారులు, మామిడి పల్ప్ ప్రాసెసర్లు, బాట్లింగ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply