ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరితగతిన విచారణ చేయాలి

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరితగతిన విచారణ చేయాలి
అధికారులకు ఇన్ చార్జ్ కలెక్టర్ ఆదేశం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరితగతిన విచారణ చేసి బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇన్ చార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశంను కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసులపైన, బాధితులకు అందిన పరిహారం, ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలు పై చర్చించారు. పాతపట్నంలో ఎస్సీలకు బరియల్ గ్రౌండ్, బరియల్ గ్రౌండ్ కు వెళ్లేందుకు రహదారి ఏర్పాటు చేయాలని సభ్యులు సిర్ల ప్రభాకరరావు తెలిపారు.
సభ్యులు డి. రాంబాబు మాట్లాడుతూ, నరసన్నపేటలో శ్రీరాంపురం గ్రామంలో శ్మశానవాటికకు రహదారి లేదని చెప్పారు. కమిటీ సభ్యులు దాసరి తిరుమలరావు మాట్లాడుతూ, శ్రీకాకుళం పట్టణంలో ఉన్న బిఆర్ అంబేడ్కర్, బాబూ జగజ్జీవన్ రాం విగ్రహాల వద్ద శాశ్వతంగా నిచ్చెన సదుపాయం ఏర్పాటు చేయాలని కోరారు. సభ్యులు గేదెల రమణమూర్తి, తోట రాములు మాట్లాడుతూ, పౌర హక్కుల దినోత్సవం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఆ సమావేశానికి సంబంధిత అధికారులు హాజరు కావాలన్నారు.
ఈ సమావేశంలో శాసన సభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, గ్రంధాలయ సంస్థ చైర్మన్ విఠల్ రావు, డిసిఎంఎస్ ఛైర్మన్ చౌదరి అవినాష్, ఇన్ చార్జ్ ఆర్డీఓ వేణుగోపాల్, టెక్కలి డిఎస్పి లక్ష్మణరావు, డిసిఓ వై. యశోదలక్ష్మి, బిసి సంక్షేమ అధికారి అనూరాధ, డిడి కె. వినాయకం, బిసి కార్పోరేషన్ ఈడి గడ్డెమ్మ, ఎపిపిలు కె. వెంకటలక్ష్మి, రఘునాథ్, తదితరులు పాల్గొన్నారు.
