లిఫ్ట్-1 పంపు హౌస్ నిర్మాణ పనుల పరిశీలన..

చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులోని గండి రామారం ఎత్తిపోతల పథకంలోని లిఫ్ట్-1 పంపు హౌస్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులు, కాంట్రాక్టర్, ప్రజా ప్రతినిధులతో కలిసి క్షేత్ర స్థాయిలో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా పనులు జరుగుతున్న తీరుపై అధికారులు, కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ స్టేషన్ లేకుండా పంపు హౌస్ ఎలా పని చేస్తుంది, నీటిని ఎలా లిఫ్ట్ చేస్తారు, పంపు హౌస్ తో పాటు సబ్ స్టేషన్ నిర్మాణం చేయాలని తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొన్న మంత్రి సమీక్షా సమావేశంలో జూన్ 30వరకు పూర్తి చేస్తామని ఎలా చెప్పారని, సాధ్యం కానీ పనులు ఎందుకు చెప్తారని మండిపడ్డారు. సమస్యలు చెప్పకపోతే ఎలా పరిష్కారం అవుతాయాని ప్రశ్నించారు. పంపు హౌస్ సివిల్ వర్క్ ఎప్పటి వరకు పూర్తి చేస్తారు, సబ్ స్టేషన్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అప్రోచ్ ఛానల్ వర్క్ ఎప్పుడు పూర్తి చేస్తారు అని ప్రశ్నల వర్షం కురిపించారు.

తాను నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశానని సాంకేతికంగా నీటి పారుదల శాఖ పూర్తి అవగాహన నాకు ఉందని అన్నారు. లిఫ్ట్ -1ద్వారా చెరువులు, కుంటలు నింపేందుకు అదనపు పైప్ లైన్ అనుమతులు, పంపు హౌస్ వరకు అప్రోచ్ రోడ్ నిర్మాణం, పంపు హౌస్ వద్ద రెండు రూముల ఆఫీస్ కార్యాలయం నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి రెండు రోజులలో అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. లిఫ్ట్ -1 కు సంబందించి ప్రతీ కాంపోనెంట్ పై పూర్తి స్థాయి సమీక్షా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

సివిల్ వర్క్, ఎలక్ట్రీకల్, అప్రోచ్ ఛానల్, పంపింగ్ మోటార్స్, పైప్ లైన్ వంటి పనులను ఖచ్చితమైన తేదీలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో జులై 31నాటికి లిఫ్ట్ -1పనులు పూర్తి చేయాలని, ఈ వర్షాకాలంలోనే లిఫ్ట్-1 ద్వారా సాగు నీరు అందించాలని స్పష్టం చేశారు. ఇందుకు ఏ సమస్యలు ఉన్న పరిష్కరించేందుకు నేను సిద్ధంగా ఉంటానని అన్నారు. లిఫ్ట్ -1ను పూర్తి చేసేందుకు నేను ఎంత సీరియస్ గా ఉన్నానో అధికారులు, కాంట్రాక్టర్లు కూడా అంతే సీరియస్ గా పని చేయాలని ఇందులో ఏమాత్రం జాప్యం జరిగినా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ఏతైనా ప్రాంతాలు చిల్పూర్, వేలేరు మండలాలకు సాగు నీరు అందించేందుకు 104కోట్లతో 3లిఫ్ట్ లు L1, L2, L3 లతో గండి రామారం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో లిఫ్ట్ -2పనులు పూర్తి అయ్యాయని అన్నారు. ఈ రోజు లిఫ్ట్ – 1 పంపు హౌస్ నిర్మాణ పనులను పరిశీలించగా, పనులు చాలా మందకోడీగా జరగడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో జులై 31వరకు లిఫ్ట్ పనులు పూర్తి చేసి ఈ వర్షాకాలంలోనే చిల్పూర్, వేలేరు మండలాల రైతులకు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

నా మొట్ట మొదటి ప్రాధాన్యత సాగు నీటి రంగమేనని నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఎస్ఈ సీతారాం, ఈఈ ప్రవీణ్, కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, చిల్పూర్, వేలేరు మండలాల సర్పంచులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply