డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం ముఖ్యం
- యువత వ్యసనాలకు గురికావద్దు
- లక్ష్యం కోసం కృషి చేయాలి
- గొప్ప వ్యక్తుల జీవితాలు ఆదర్శంగా, ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి
- ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని సాధన చేయాలి
- సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
కోదాడ, ఆంధ్రప్రభ : మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం (జూన్ 26) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఈగల్ ఫోర్స్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం అనంతగిరి మండల పరిధిలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ యువత దేశాభివృద్ధికి కీలక వనరులుగా ఎదగాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని, గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
విద్యార్థులు, యువత దేశ సంపద అని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారు నేరాలకు పాల్పడటంతో పాటు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని హెచ్చరించారు.

జిల్లాలోని అన్ని కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగం, రవాణా, సరఫరాపై సమాచారం అందించి నిర్మూలనకు సహకరించాలని కోరారు. డ్రగ్స్‌కు బానిసైన విద్యార్థులు, యువత గురించి సమాచారం అందిస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలు ప్రస్తుతం సమాజంలో పెద్ద సవాలుగా మారాయని ఎస్పీ పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు, పిన్ నంబర్లు చెప్పవద్దని సూచించారు. ఉచితాలు, బహుమతుల పేరుతో మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు వాహనాలను వేగంగా నడపకూడదని, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని, బైక్ రేసులకు దూరంగా ఉండాలని సూచించారు.
అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పోలీసు కళాబృందం సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా డ్రగ్స్, సైబర్ మోసాలపై అవగాహన కల్పించింది.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ నవీన్ కుమార్, షీ టీమ్స్ ఎస్ఐ మల్లేష్, కళాశాల ప్రిన్సిపాల్ డా. సురేష్ కుమార్, ఫార్మసీ ప్రిన్సిపాల్ ఎం. ఈశ్వరయ్య, వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి, ప్రసాద్, భూపతిరావు, అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
