థాయిలాండ్‌లో నిజామాబాద్ తైక్వాండో క్రీడాకారుల సత్తా

అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు కైవసం
బంగారు, వెండి, రెండు కాంస్య పతకాలతో మెరిసిన యువ క్రీడాకారులు

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : థాయిలాండ్‌లోని పట్టాయాలో జరిగిన 9వ హీరోస్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో నిజామాబాద్ క్రీడాకారులు సత్తా చాటారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం నాలుగు పతకాలు సాధించారు. పట్టాయాలోని ఈస్టర్న్ నేషనల్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో 33 దేశాల నుంచి 4,403 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. నారాయణరెడ్డి కాలనీ, బోధన్‌ రోడ్డులోని తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇండియాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు భారత జట్టు తరఫున పోటీపడ్డారు.

షేక్ మైతాబ్ అహ్మద్ 81 కిలోల విభాగంలో రెండు విభాగాల్లో పోటీ చేసి ఒక బంగారు, ఒక కాంస్య పతకం సాధించాడు. షేక్ తల్హా 41 కిలోల విభాగంలో రాణించి వెండి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇల్హాన్ అబ్దుల్లా ఫారూకీ 31 కిలోల విభాగంలో పోరాడి కాంస్య పతకం సాధించాడు. ఈ విజయాల వెనుక తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇండియా అంతర్జాతీయ కోచ్, రిఫరీ డాక్టర్ అబ్దుల్లా ఫారూకీ అందిస్తున్న శిక్షణ కీలకంగా నిలిచింది. క్రమశిక్షణ, అంకితభావంతో క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ వారిని అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దుతున్నారని నిర్వాహకులు తెలిపారు.

పతక విజేతలకు పోలీస్ కమిషనర్ అభినందనలు

థాయిలాండ్ నుంచి నిజామాబాద్‌కు తిరిగి వచ్చిన క్రీడాకారులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సాదరంగా స్వాగతించి సన్మానించారు. పతక విజేతలకు సర్టిఫికెట్లు అందజేసి అభినందనలు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి విజయవంతమైన జీవితానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఏసీపీ బి. ప్రకాష్ కూడా క్రీడాకారులను సన్మానించి అభినందించారు. క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని అన్నారు. తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్‌లో యువత మరింతగా పాల్గొని తమ ప్రతిభను వెలికితీయాలని సూచించారు.

మాజీ ఉపమేయర్ సన్మానం
మాజీ ఉపమేయర్ మీర్ మజాజ్ అలీ కూడా తన నివాసంలో తైక్వాండో క్రీడాకారులను సన్మానించి అభినందించారు. నిజామాబాద్ యువ క్రీడాకారులు భవిష్యత్తులో ఆసియా, ఒలింపిక్ స్థాయిలోనూ పతకాలు సాధించి దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ వేదికపై నిజామాబాద్ క్రీడాకారులు నాలుగు పతకాలు సాధించడంతో వారి తల్లిదండ్రులు, కోచ్‌లు, క్రీడాభిమానులు, జిల్లా ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది.