వెల్దుర్తిలో ‘వికసిత్ భారత్–జీ రామ్ జీ’ పథకానికి శ్రీకారం..
జిల్లాలో అధికారికంగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
భూమిపూజతో పథకానికి శ్రీకారం..
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ ప్రారంభోత్సవాన్ని వీక్షించిన ఎంపీ, కలెక్టర్, ఎమ్మెల్యే
కర్నూలు, ఆంధ్రప్రభ : గ్రామీణాభివృద్ధి పనుల్లో సాంకేతికత వినియోగానికి ఊతమిచ్చే ‘వికసిత్ భారత్–జీ రామ్ జీ’ (VB-G RAM G) పథకాన్ని కర్నూలు జిల్లాలో అధికారికంగా ప్రారంభించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు భూమిపూజ నిర్వహించి పథకాన్ని ప్రారంభించారు.

అనంతరం వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంయుక్తంగా జాతీయ స్థాయిలో ప్రారంభించిన ‘వికసిత్ భారత్–జీ రామ్ జీ’ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వారు గ్రామీణాభివృద్ధి పనుల్లో పారదర్శకత, సాంకేతికత వినియోగం, పనుల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో నాణ్యతను పెంపొందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.
