దేవరకద్రలో నూతన కోర్టు భవనం ప్రారంభం..

ప్రజలకు చేరువలో న్యాయ సేవలు

దేవరకద్ర, ఆంధ్రప్రభ: దేవరకద్రలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం భవనాన్ని గురువారం తెలంగాణ హైకోర్టు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ఎన్.వి. శ్రావణ్ కుమార్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవితో కలిసి హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. స్థానికంగా జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం. ప్రేమలత, దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి కోర్టు భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రజలకు సులభంగా, వేగవంతంగా న్యాయ సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు.

కొత్త న్యాయస్థానం ప్రారంభంతో దేవరకద్ర మండలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయని, కేసుల విచారణ వేగవంతమవడంతో సమయపాలనతో కూడిన న్యాయ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ డి. జానకి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర, మున్సిపల్ చైర్‌పర్సన్ దమంతి గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ యుగంధర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.