రైతు సమస్యలపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే ధర్నా

సాగునీరు, నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ప్రభుత్వాన్ని నిలదీసిన బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ/అనంతగిరి, ఆంధ్రప్రభ: అనంతగిరి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సందర్శించారు. రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించి ప్రభుత్వ వైఖరిని నిరసించారు. తర్వాత రైతులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, కోదాడ నియోజకవర్గంలోని చెరువులు నిండకపోవడానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డే బాధ్యత వహించాలని ఆరోపించారు. కోదాడ నియోజకవర్గ రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

జూన్ చివరి వారంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి రోజుకు సుమారు 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి నల్గొండ, ఖమ్మం జిల్లాల చెరువులను నింపుతూ పాలేరు రిజర్వాయర్‌కు తరలించాలని నిర్ణయించినప్పటికీ, ముందుగా కోదాడ నియోజకవర్గ చెరువులను నింపకుండా నీటిని పాలేరు రిజర్వాయర్‌కు తరలించారని ఆరోపించారు. రైతులు గేట్ల వద్దకు రాకుండా పోలీసులను మోహరించారని అన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వ్యవహారంలో మౌనం పాటించడం బాధాకరమన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు తమ ప్రాంత ప్రయోజనాలను కాపాడుకుంటుండగా, సొంత జిల్లా రైతుల ప్రయోజనాలను రక్షించడంలో మంత్రి విఫలమయ్యారని విమర్శించారు.

మంత్రి హెలికాప్టర్లలో పర్యటిస్తూ ఉపయోగంలో లేని లిఫ్ట్ పథకాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారని, కానీ ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన పూడిక, తుమ్మను తొలగించి రైతులకు నీరు అందించే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

రెడ్లకుంట, శాంతినగర్ లిఫ్ట్‌ల పేరుతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వం కమిషన్ల కోసమే పనిచేస్తోందని, అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ విషయాలను ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

కోదాడ ప్రజలు రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించినప్పటికీ, అదే ప్రజలు, రైతాంగానికి అన్యాయం జరిగేలా మంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎడమ కాలువ నుంచి నీరు విడుదల చేసిన తర్వాత కూడా చెరువులు నింపకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటే మంత్రి ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కోదాడ నియోజకవర్గ ప్రజలకు, రైతులకు జరిగిన అన్యాయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.