బీసీ రిజర్వేషన్ కోటాపై అభిప్రాయాల స్వీకరణకు రంగం సిద్ధం
బీసీ రిజర్వేషన్ కోటాపై అభిప్రాయాల స్వీకరణకు రంగం సిద్ధం
ఏలూరుకు రానున్న రాష్ట్ర డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్ర
ఏలూరు, ఆంధ్రప్రభ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాకు సంబంధించి వివిధ బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అభిప్రాయాలు, వినతులు స్వీకరించేందుకు రాష్ట్ర డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్ర ఈ నెల 11న ఏలూరుకు రానున్నారు.
ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై అభిప్రాయాలు, సూచనలు సేకరించేందుకు రాష్ట్ర డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలతో సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలు, వినతిపత్రాలను స్వీకరించనున్నారు.
స్థానిక సంస్థల రిజర్వేషన్ల మదింపుకు అవసరమైన సమాచారం, అభిప్రాయాలు, సూచనలను సంబంధిత ఆధారాలతో వినతిపత్రాల రూపంలో కమిషన్‌కు సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన బీసీ వర్గాల సంఘాలు, సామాజిక సంస్థలు, అవగాహన కలిగిన వ్యక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.
