కిరాయి అడిగాడని… ఆటో డ్రైవర్‌పై దాడి

బూర్గంపాడు, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఆటో కిరాయి అడిగినందుకు ఓ ఆటో డ్రైవర్‌పై బీర్ బాటిల్‌తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోలో ప్రయాణించిన ఓ వ్యక్తి కిరాయి చెల్లించే సమయంలో రూ.500 నోటు ఇచ్చాడు. చిల్లర లేకపోవడంతో నోటు మార్చుకుని వస్తానంటూ సమీపంలోని వైన్ షాప్‌కు వెళ్లాడు. అయితే అక్కడ మద్యం సేవిస్తూ కనిపించడంతో ఆటో డ్రైవర్ తన కిరాయి చెల్లించాలని కోరాడు.

దీంతో ఆగ్రహానికి గురైన సదరు వ్యక్తి బీర్ బాటిల్‌తో ఆటో డ్రైవర్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ గాయపడగా చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బూర్గంపాడు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆటో యూనియన్ నాయకులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.