Sensex | నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు…

సెన్సెక్స్ 388 పాయింట్లు డౌన్‌
అమ్మకాల ఒత్తిడితో సూచీలకు నష్టాలు.. 24,500 దిగువకు నిఫ్టీ


Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమై.. రోజంతా అదే ఒరవడిని కొనసాగించాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి ప్రధాన సూచీలు నష్టాల్లోనే స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెట్టుబడిదారుల అప్రమత్తతతో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

మంగళవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 388.19 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టపోయి 78,154.25 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 112.10 పాయింట్లు లేదా 0.46 శాతం క్షీణించి 24,471.70 వద్ద ముగిసింది. దీంతో నిఫ్టీ మరోసారి 24,500 స్థాయి దిగువకు చేరింది.

మార్కెట్‌ మొత్తం నష్టాల్లో ఉన్నప్పటికీ కొన్ని కంపెనీల షేర్లలో కొనుగోళ్లకు ఆసక్తి కనిపించింది. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్‌ గెయినర్స్‌ జాబితాలో నిలిచాయి. మరోవైపు బలరాంపూర్ చిని మిల్స్ లిమిటెడ్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్, లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని నష్టాలను చవిచూశాయి.

ఉదయం నుంచే ప్రతికూల ధోరణిలో కొనసాగిన సూచీలు మధ్యలో కొంత కోలుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. చివరి వరకు ఆ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. ఫలితంగా సెన్సెక్స్‌, నిఫ్టీలు దాదాపు అర శాతం మేర నష్టాలతో ముగిశాయి. మార్కెట్‌ తదుపరి కదలికపై అంతర్జాతీయ పరిణామాలు, ముడిచమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ధోరణి ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.