మాలలకు 7 శాతం రిజర్వేషన్ కల్పించాలి
రోస్టర్ విధానంతో ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలిసిన మాల సంఘాల జేఏసీ నేతలు
ఉమ్మడి మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: తెలంగాణలో మాల సామాజిక వర్గానికి రోస్టర్ విధానం కారణంగా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని మాల సంఘాల జేఏసీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. మాలలకు 7 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందల భాస్కర్, గౌరవ చైర్మన్ చెరుకు రామచంద్ర ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు ఢిల్లీలో బండి సంజయ్‌ను కలిసి మాల సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రోస్టర్ విధానంలో మాలలకు అన్యాయం జరుగుతోందని, ఉద్యోగ నియామకాల్లో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మాలల జనాభాను తక్కువగా చూపుతోందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాలలకు 7 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌ను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తరఫున సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ సానుకూలంగా స్పందించి, మాల సంఘాల నాయకులు లేవనెత్తిన డిమాండ్లు న్యాయమైనవేనని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ మంత్రి నర్సింహ, వైస్ చైర్మన్ తుమ్మ శ్రీనివాస్, మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మదాసు రాహుల్, తాలూకా అనిల్, జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు గోపాజు రమేష్, మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ చేపూరి ప్రణయ్, పామబల సుధాకర్, ఆనంద్, పండుగ బానూతేజ, బత్తుల రమేష్, చీమలదారి నాగేశ్వర్, డబ్బా రాములు, కాంచమి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
