మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్‌ వెన్నెల బాలమణి

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని బాచన్‌పల్లి సర్పంచ్‌ వెన్నెల బాలమణి సూచించారు. భీమ్‌గల్‌ మండలం బాచన్‌పల్లి గ్రామంలో ఐకేపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్‌ వెన్నెల బాలమణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెల సమావేశాలు నిర్వహించుకుని ప్రభుత్వ పథకాలపై చర్చించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో పరిసరాల పరిశుభ్రతను పాటించడంతో పాటు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కోరారు. మహిళా సంఘాల సభ్యులు రుణాలను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకుని ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని అవగాహన కల్పించారు.

ఐకేపీ సీనియర్‌ సీసీ కుంట శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని సూచించారు. గ్రామ సంఘానికి లాభాలు వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఐకేపీ సీనియర్‌ సీసీ పురస్తు నరేష్‌ మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు ఐకేపీ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. బ్యాంకు రుణాలు తీసుకునే సమయంలో ప్రతి సభ్యురాలు బీమా చేయించుకోవాలని తెలిపారు. బ్యాంకు రుణాలు, శ్రీనిధి రుణాలు, గ్రామ సంఘం రుణాలపై అవగాహన కల్పించారు.

అనంతరం గ్రామ సంఘం లెక్కలను సభ్యులకు చదివి వినిపించి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కర్ర సంతోషి, ఉపాధ్యక్షురాలిగా కందకూర్తి లాస్య, కార్యదర్శిగా దొంతుల కావేరి, సహాయ కార్యదర్శిగా లక్ష్మి, కోశాధికారిగా వైష్ణవిని ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఐకేపీ వీవోఏ నాగమణి, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.