అటవీ హక్కుల లబ్ధిదారులకు ప్రభుత్వం పూర్తి అండ

అటవీ హక్కుల పత్రాలు పొందిన వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు: జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా

ఉట్నూర్, ఆంధ్రప్రభ: అటవీ హక్కుల పత్రాలు పొందిన గిరిజనులు, ఇతర సంప్రదాయ అటవీ నివాసుల సమస్యల పరిష్కారంతో పాటు వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా తెలిపారు.

మంగళవారం ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌ పీఎంఆర్సీ భవనంలో దొంగచింత, బీర్సాయిపేట్‌ గ్రామపంచాయతీల పరిధిలో అటవీ హక్కుల గుర్తింపు చట్టం–2006 అమలుపై పైలట్‌ సామాజిక తనిఖీ, ప్రజా వేదిక నిర్వహించారు. సీఏజీ, క్రిస్ప్‌ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరంద్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు గిరిజన రైతులు తమ సమస్యలు, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ పథకాల అమలుపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. అటవీ హక్కుల పత్రాలు పొందిన రైతులకు పంట రుణాలు, రైతు భరోసా, వ్యవసాయ రాయితీలు, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు వాస్తవంగా అందుతున్నాయా లేదా అనే అంశాలను సామాజిక తనిఖీ ద్వారా సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. పట్టాదారులు మరణించిన సందర్భాల్లో వారి వారసుల పేర్లకు అటవీ హక్కుల పత్రాలను బదిలీ చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. అర్హులైన వారసులు ఐటీడీఏ లేదా సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పట్టా ఉన్నా లేకపోయినా అటవీ భూముల్లో సాగు చేస్తున్న అర్హులైన రైతులకు ఎరువులు, విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా మార్కెట్‌లో తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునేలా అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.

కోర్‌ ఏరియాలో ఇప్పటికే తవ్విన బోరుబావులను వినియోగంలోకి తీసుకురావడానికి సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు కల్పించే విషయంలో అటవీశాఖ అధికారులతో సమన్వయం చేస్తామని చెప్పారు. వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన లబ్ధిదారులు ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలతో గ్రామపంచాయతీ కార్యదర్శి వద్ద దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పింఛన్‌ పథకాల ప్రయోజనాలు పొందాలని సూచించారు.

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరంద్‌ మాట్లాడుతూ.. అడవుల్లో తరతరాలుగా నివసిస్తున్న గిరిజనుల హక్కులను గుర్తించాలనే ఉద్దేశంతోనే అటవీ హక్కుల గుర్తింపు చట్టం–2006 అమల్లోకి వచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా సాగు హక్కులు, నివాస హక్కులు, సామూహిక అటవీ హక్కులు, అటవీ వనరుల వినియోగ హక్కులు వంటి ప్రధాన హక్కులు లబ్ధిదారులకు కల్పిస్తున్నట్లు వివరించారు.

చట్టం అమలు ద్వారా నిర్దేశించిన లక్ష్యాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు నెరవేరుతున్నాయో స్వతంత్రంగా అంచనా వేయడానికే క్రిస్ప్‌ సామాజిక తనిఖీ బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ గంగాధర్‌, ఉట్నూర్‌ ఆర్డీవో మోహన్‌సింగ్‌, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్‌సింగ్‌, ఎల్‌డీఎం ఉత్పల్‌కుమార్‌, ఏపీవోలు వసంత్‌రావు, భాస్కర్‌, కిసాన్‌ గిరిజనమిత్ర సమన్వయకర్త హర్ష, అటవీ, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు, క్రిస్ప్‌, కిసాన్‌ మిత్ర హెల్ప్‌లైన్‌ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.