తుగ్గలి–గుంతకల్ ఆర్ అండ్ బి రోడ్డును దున్నేస్తున్న రైతులు

తుగ్గలి–గుంతకల్ ఆర్ అండ్ బి రోడ్డును దున్నేస్తున్న రైతులు
తుగ్గలి – ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన తుగ్గలి నుంచి గుంతకల్, పత్తికొండ, గుత్తి పట్టణాలకు వెళ్లే ప్రధాన ఆర్ అండ్ బి రహదారి రోజురోజుకు ఆక్రమణలకు గురవుతూ ప్రమాదకరంగా మారుతోంది. రహదారి ఇరువైపులా ఉన్న కొందరు రైతులు రోడ్డు భూమిని దున్ని తమ వ్యవసాయ పొలాల్లో కలుపుకుంటున్నారని స్థానికులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో రహదారి వెడల్పు గణనీయంగా తగ్గిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ రహదారిపై ప్రతిరోజూ వందలాది వాహనాలు, పాఠశాల బస్సులు, రైతుల ట్రాక్టర్లు, సరుకు రవాణా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అయితే రోడ్డు పక్కనున్న భూములను ఆక్రమిస్తూ దున్నివేయడం వల్ల రహదారి అంచులు కనుమరుగవుతున్నాయని, ఎదురెదురుగా వచ్చే వాహనాలు దాటుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహనదారులు తెలిపారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో, వర్షాకాలంలో ప్రమాదాలు సంభవించే అవకాశం అధికంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి వెడల్పు తగ్గిపోవడంతో ప్రమాదాల ముప్పు పెరిగిందని పేర్కొంటున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు పత్తికొండ డివిజన్ ఆర్ అండ్ బి అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రహదారి పరిమితులను గుర్తించి ఆక్రమణలను తొలగించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
రోడ్డు భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని రహదారి అసలు వెడల్పును పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక గ్రామాల ప్రజలు మాట్లాడుతూ, రహదారి పక్కన ఉన్న సరిహద్దు రాళ్లు చాలాచోట్ల కనిపించకుండా పోయాయని, దీనిని ఆసరాగా చేసుకుని కొందరు రైతులు రోడ్డు భూమిని ఆక్రమిస్తున్నారని తెలిపారు.
ఇప్పటికైనా రెవెన్యూ, ఆర్ అండ్ బి శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఆక్రమణలను గుర్తించి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. లేదంటే భవిష్యత్తులో జరిగే ప్రమాదాలకు సంబంధిత శాఖల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
