దేశంలోనే నంబర్‌వన్‌గా తెలంగాణ ఆర్టీసీ

దేశంలోనే నంబర్‌వన్‌గా తెలంగాణ ఆర్టీసీ

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులు

అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తాం: మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కరీంనగర్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) దేశంలోని ప్రజా రవాణా సంస్థల్లో నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

బుధవారం కరీంనగర్ జిల్లాలో మంత్రులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మాట్లాడి, బస్సుల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, పాఠశాలలు, కళాశాలల సమయాలకు అనుగుణంగా అదనపు బస్సులు నడుపుతున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకం అమలుతో మహిళల ప్రయాణాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేసినట్లు చెప్పారు.

ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా, ఆర్టీసీకి మహిళలను ప్రధాన భాగస్వాములుగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

కార్మికుల సమస్యలు త్వరలో పరిష్కారం

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు తెలిపారు. కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని, ఎన్నికలు పూర్తైన వెంటనే గుర్తింపు పొందిన సంఘం నాయకులతో చర్చలు జరిపి విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు.

పీఆర్సీ ప్రకటించడం, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించడం, విలీన ప్రక్రియ చేపట్టడం వంటి చర్యలపై ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య

గురుకుల పాఠశాలల్లో మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన వసతి, విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నామని, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యను అందిస్తున్నామని వివరించారు.

నీట్ అభ్యర్థులకు ఉచిత ప్రయాణం

జూన్ 21న జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ స్వామి కోరిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, హాల్‌టికెట్ ఉన్న అభ్యర్థులకు ఉచిత ప్రయాణం కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తాం

సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని మంత్రులు స్పష్టం చేశారు. పూర్తిస్థాయి పారదర్శకతతో టెండర్ల ప్రక్రియ నిర్వహించామని తెలిపారు.

విద్యార్థులకు అవసరమైన వస్తువుల కొనుగోలుకు రూ.683 కోట్ల విలువైన కాంట్రాక్టులను ప్రభుత్వ రంగ సంస్థలైన లీడ్‌క్యాప్, చేనేత రంగ సంస్థలకు సుమారు రూ.500 కోట్ల మేర కేటాయించినట్లు వివరించారు. మొత్తం రూ.1,142 కోట్ల టెండర్ల ప్రక్రియ జరిగితే, రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించడం విచిత్రంగా ఉందన్నారు.

టెండర్లలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తాము పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.

గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు కనీసం డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచలేదని మంత్రులు విమర్శించారు.